Mobile AppDownload and get updated news
సరి-బేసి విధానం గుర్తుందా? ఢిల్లీ రోడ్లపై వాతావరణ కాలుష్యాన్ని, ట్రాఫిక్ ను తగ్గించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ సరికొత్త విధానాన్ని అమలుచేసింది. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు ట్రయల్ రన్ కూడా జరిగింది. త్వరలో దీనిని పూర్తిస్థాయిలో అమలు పరిచే అవకాశం కూడా ఉంది. ఈ విధానం బీహార్లో ఎప్పటి నుంచో అమలవుతోంది. అయితే వాహనాల విషయంలో కాదు... పాఠశాలల విషయంలో. అక్కడ వారానికి మూడు రోజులే విద్యార్థులు స్కూలుకి వెళతారు. అంటే సోమవారం స్కూలుకి వెళ్లిన పిల్లలు మంగళవారం వెళ్లరు. మళ్లీ బుధవారమే వారికి స్కూలు. ఇలా రోజు తప్పి రోజు వారు చదువు సాగుతోంది. దీనికి కారణం విద్యార్థుల సంఖ్యకి తగ్గట్టు స్కూళ్ల భవనాలు లేకపోవడమే. కొన్ని చోట్లయితే మరీ ఘోరంగా ఒకపూట ఎలిమెంట్రీ స్కూలు పిల్లలు వస్తే, రెండో పూట పెద్ద తరగతుల పిల్లలు వస్తున్నారు. అంటే ఒకే భవనంలో రెండు స్కూళ్లు, రెండు వేరు వేరు సమయాలలో నడుస్తున్నాయి. ఈ పరిస్థితి ఇప్పటిది కాదు... ఎప్పటి నుంచో ఇదే దుస్థితి. అయినా ఎవరూ స్పందించడం లేదు. పిల్లల చదువుపై బీహార్ సర్కారుకి అంత శ్రద్ధ ఉంది మరి. ఈ విషయంపై సరన్ జిల్లా విద్యాధికారిని అడుగగా తరగతి గదులు సరిపడా లేకపోవడం వల్లే ఇలా రోజు తప్పి రోజు స్కూలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 3000 కి పైగా విద్యార్థులు ఉంటుండడంతో సగం మంది విద్యార్థులు ఓ రోజు, మిగతా సగం మంది మరుసటి రోజు వచ్చి చదువుకుంటున్నారని వివరించారు. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ టీచర్ మాట్లాడుతూ 'ఇదే అసలైన సరి-బేసి విధానానికి ఉదాహరణ' అని వ్యాఖ్యానించారు. పిల్లలకు మాత్రం వారంలో మూడు రోజులు స్కూలు నాలుగు రోజులు సెలవులు కావడంతో... ఆటల్లో మునిగిపోతున్నారు.