ఇదే టీమ్‌కి చెందిన 18 ఏళ్ల మునేష్ కుమారి మాట్లాడుతూ... "2013లో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కి భారత్ తరపున ఆడే అవకాశం లభించడం చాలా సంతోషంగా అనిపించింది అని అన్నారు. మా ఊరి నుంచి మరో నలుగురు అమ్మాయిలకి కూడా ఛాన్స్ వచ్చింది కానీ పాస్ పోర్ట్స్ లేని కారణంగా వారు అక్కడికి రాలేకపోయారు. అందుకే అంతర్జాతీయ స్థాయి పోటీలకి ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాలపై తమకి తగిన విధంగా మార్గదర్శకాలు అందించాల్సిన అవసరం వుంది అని తెలిపారామె. మరో క్రీడాకారిణి నీలం కుమారి మాట్లాడుతూ.. టోర్నమెంట్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ చూస్తుంటాం. అక్కడికొచ్చే క్రీడాకారులు అందరూ డైట్ చార్ట్ మెయింటెన్ చేస్తుంటారు. కానీ మాకు అవేవి తెలియదు. ఇంటివద్ద దొరికేదేదో తినేస్తుంటాం. అందుకే క్రీడాకారులకి అవసరమైన డైట్ చార్ట్ గురించి చెప్పేవాళ్లు కూడా ఉండాలి అని అభిప్రాయపడ్డారు. స్పోర్ట్స్ కిట్స్, బూట్లు ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ గోవర్ధన్ దాస్ సమకూర్చగా గ్రామస్తులు కొంత నిధులు విరాళంగా అందచేశారు. 2006లో గోవర్ధన్ మొదటిసారి వీళ్లకు ఈ క్రీడని పరిచయం చేశారు.
తెలుగు సమయం అభిప్రాయం:
క్లిష్టమైన పరిస్థితుల్లోనూ క్రీడలని ప్రేమించేవారు, అంతే క్లిష్టమైన పరిస్థితులని, టోర్నమెంట్‌లని కూడా ఎదుర్కోగలరు. కానీ ఒక క్రీడాకారునికి అవసరమైనటువంటి ఏ విధమైన సౌకర్యం లేకుండా ప్రతికూల పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేసే ఇలాంటివాళ్లు అంతర్జాతీయ స్థాయి వేదికలపై తమ సత్తా చాటుకోగలరా అనేదే ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న. కావాల్సినంత ప్రతిభ ఉండి కూడా నిర్లక్ష్యానికి గురవుతున్న వారిలో ఈ అలక్‌పురా గ్రామస్తులే ఓ చక్కటి ఉదాహరణ. గ్రామీణ ప్రాంతాల్లోనూ చక్కటి క్రీడాప్రాంగణాలు నిర్మించి, వారికి అన్నిరకాల సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఇటువంటి అలక్‌పురా గ్రామాలని, అక్కడి మట్టిలో మాణిక్యాలని ఇకనైనా పట్టించుకోకపోతే, నాలుగేళ్లకోసారి వచ్చే ఒలంపిక్స్‌లో మనకి మెడల్స్ రాలేదేంటబ్బా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు.
పోషకాహారం, బూట్లు, సదుపాయాలు ఏవీ లేవు:
విరాళాలపై ఆధారపడి ఆడే క్రీడాకారులకి బూట్లు, స్పోర్ట్స్ కిట్లు పొందడం ఎంత కష్టమో ఊహించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. బూట్లు ధరించకుండా పాదాలతోనే ప్రాక్టీస్ చేస్తున్న ఎందరో ఆటగాళ్లకి బూట్లు అందించగలిగితే వారి ఆటలో మరింత పరిణతి కనిపించకపోతుందా ? గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో శిక్షణ పొందేవారంతా నిరుపేదలే. వారికి అన్ని పోషక విలువలు ఉన్న ఆహారం అవసరం లేదా ? జిమ్ సౌకర్యాలు లేని గ్రామీణ క్రీడాకారులు ఇటుకలనే డంబెల్స్‌గా చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకొందరు మైళ్ల దూరం నుంచి ఇంటికి మంచినీటిని తోడుకొచ్చుకుంటున్నారు. వారికే సరైన సదుపాయాలు కల్పించినట్టయితే, ఇండియా ఒలంపిక్స్ మెడల్స్ పట్టికలో ఎందుకు వెనుకబడుతుంది అని ఆలోచించాల్సిన అవసరం వుంది.
Mobile AppDownload and get updated news