Mobile AppDownload and get updated news
వాణిజ్య పరంగా లింగ నిర్థరణ పరీక్షల సమాచారాన్ని, ప్రచార ప్రకటనలను ఇండియాలో నిషేధించేందుకు టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ , యాహూ లు అంగీకరించాయి. ప్రభుత్వ విఙ్ఞప్తి మేరకు ఈ సంస్థలు తమ వెబ్‌సైట్ నుంచి వివరాలను తొలగించాయి. లింగ నిర్ధరణ పరీక్షలు, వాటి ఉత్పత్తలకు సంబంధించిన ఈ విషయాలను గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ నిషేధం విధించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. సెక్స్ నిర్ధారణ ప్రకటనల శోధనలోని కీలక పదాలను తొలగించాయని జస్టిస్ దీపక్ మిశ్రా , జస్టిస్ సి నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనానికి ప్రభుత్వం నివేదించింది. దీని ప్రకారం ఇకపై జెండర్ నిర్ధారణకు సంబంధించిన సమాచారం ఈ సెర్చ్ ఇంజిన్లలో లభించదు. ఇండియాలోని నిబంధనలు ప్రకారం లింగ నిర్థరణ ప్రకటనల్లో కీలక పదాలను తొలగించాలని సర్వోన్నత న్యాయస్థానం గత జులై 5 న ఈ సంస్థలను హెచ్చరించింది. 2014 డిసెంబరులో సాబు మాథ్యూ జార్జ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ఎందుకంటే ఇండియాలో స్త్రీ, పురుష నిష్పత్తిలో ఎక్కువ అంతరం ఉన్నట్లు 2011 జనాభా లెక్కల్లో తేలింది. మన దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఈ అంతరాన్ని తగ్గించడానికి 1994 నుంచి లింగ నిర్ధరణ పరీక్షలను ఇండియాలో నిషేధించారు. దీని ప్రకారం ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటారు. లింగ నిర్ధరణ వల్ల వేలాది మంది ఆడ శిశువులను పిండ దశలోనే అంతం చేస్తున్నారు. మగ పిల్లలైతే తమ వారసత్వాన్ని నిలబెడతారనేది కొంత మంది తల్లిదండ్రులు నమ్మకం. ఇండియాలో మగ పిల్లలకు మాత్రమే అవసరమైన మేర పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని ఐక్యరాజ్యసమితి 2015లో విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అంతే కాకుండా ఐదేళ్లలోపు వయసున్న బాలబాలికల నిష్పత్తిలో ప్రపంచంలోనే అత్యంత దారుణంగా ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఐదేళ్లలోపు బాలురు 93 మంది చనిపోతే, 100 మంది బాలికలు చనిపోయారని ఐక్యరాజ్యసమితి నివేదికలో తెలిపింది. 2007 నుంచి భారత్ సుమారు కోటి మంది బాలికలను కోల్పొయిందని యునిసెఫ్ తెలిపింది. ఇండియాలో చట్ట ప్రకారం లింగ నిర్ధరణ పరీక్షలు నేరం కాబట్టి వాటిని తొలగించామని గూగుల్ పేర్కొంది. ఈ అంశం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయమని ఎందుకంటే చట్టానికి సంబంధించిందని యాహూ పేర్కొంది.