2015 మీకు ఎలా అనిపించింది ?
2015ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. తాతయ్య మమ్మల్ని వీడిపోయిందీ ఈ సంవత్సరంలోనే. అలాగే 'ఐరా' మా ఇంట్లోకి అడుగుపెట్టింది కూడా ఈ ఏడాదే. ఇక సినిమాల విషయానికొస్తే, బేబీ, బాహుబలి, రుద్రమదేవి సినిమాలు 2015లో క్షణం తీరిక లేకుండా చేశాయి. బాహుబలి షూటింగ్‌లో వుండగా నా మోకాలికి గాయమైంది. అలా నేను 2 నెలలు గ్యాప్ తీసుకున్నాను. అదే సమయంలో మళ్లీ ప్రభాస్ భుజానికి గాయమైంది. దీంతో మరో మూడు నెలలు షూటింగ్‌కి గ్యాప్ దొరికింది. ఆ ఐదు నెలలు నేను ఖాళీగా వున్న సమయంలోనే బాలీవుడ్‌లో బేబీ సినిమా కోసం నీరజ్ పాండే నుంచి కాల్ వచ్చింది. మళ్లీ ఆ తర్వాత బాహుబలి, రుద్రమదేవి సినిమాల షూటింగ్. అలా క్షణం తీరికలేకుండా గడిచిపోయిందీ సంవత్సరం. నటుడిగా పాత్రల ఎంపిక విషయంలో ఒక ఛట్రంలో ఇరుక్కుపోవడం నాకు ఏ మాత్రం ఇష్టంలేదు. అందుకే భిన్నమైన పాత్రలు ఎంచుకోవడానికి ఏ మాత్రం వెనుకాడను. ఆ నిర్ణయమే బాహుబలిలో భల్లాలదేవగా నన్ను హైలైట్ చేసింది అంటున్నాడు రానా. బాహుబలిలో విలన్ రోల్ చేస్తున్నాను అని తెలిసి నన్ను చాలామంది హెచ్చరించారు. ఇంకొందరు భయపెట్టారు. కానీ ఆ సినిమా వారి అంచనాలన్నీ తప్పని నిరూపించింది. చిన్నప్పటి నుంచి అటువంటి కథలే చదువుతూ పెరిగాను. రాజమౌళి గారు కథ చెప్పినప్పుడు కరెక్టుగా ఆ కథలే నా కళ్ల ముందు మెదిలాయి.
డ్యాన్స్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి ? డ్యాన్సింగ్‌పై ఎందుకు దృష్టిపెట్టరు ?
డ్యాన్సింగ్ అంటే ఎందుకో నాకదంతగా అవసరం లేదనిపిస్తుంది. డ్యాన్స్‌తో అవసరం ఏంటో నాకు ఇప్పటివరకు అర్థమవలేదు. అయినా అందరూ డ్యాన్స్ చేస్తున్నారు కదా.. ఇంకా నేనెందుకు చెప్పండి! 'నా ఇష్టం' సినిమాలో అయిష్టంగానే కొంచెం ట్రై చేశాను. కానీ ఎందుకో నాకదంత నచ్చలేదు. ఇకపై అటువంటి సినిమాలు కూడా చేయదల్చుకోలేదు.
మరి పెళ్లి సంగతేంటంటారు ?
ప్రస్తుతానికి నాకిలాగే బాగుంది. నేనెవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేను. పెళ్లికి ఇంకాస్త టైమ్ పడుతుంది.
Mobile AppDownload and get updated news