బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తాను ఏ పదవి చేపట్టలేదు కానీ... తన కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టేట్టు కనిపిస్తున్నారు. ఇప్పటికే తన ఇద్దరు కొడుకులలో ఒకరిని మంత్రిని, మరొకరిని డిప్యూటీ సీఎంను చేశారు. ఇప్పుడు తన భార్యని, కూతురిని రాజ్య సభకి పంపేందుకు పావులు కదుపుతున్నారు. ఇంతకుముందు లాలూ భార్య రబ్రీ దేవి బీహార్ సీఎంగా పనిచేశారు. కూతురు మీసా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. అందుకే వీరిద్దరిని కూడా రాజకీయ ఉద్యోగులుగా మార్చాలని లాలూ గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారు. వచ్చే ఏడాది జరగునున్న ద్వై వార్షిక ఎన్నికలలో రాజ్య సభ కు ఆర్జేడీ నుంచి వీరిద్దరినీ ఎంపిక చేసినట్టు తెలిపారు. వీరిద్దరికి సీట్టు రావడం కూడా 99 శాతం గ్యారంటీలాగే కనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లు గెలుచుకుంది. దీనిని బట్టి ఆ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు వస్తాయి. నిలబెట్టిన అభ్యర్థికి అసెంబ్లీ నుంచి 41 ఓట్లు వస్తే గెలిచినట్టే. మిత్రపక్షాలు ఎలాగూ ఉన్నాయి కాబట్టి జేడీయూ, లేదా కాంగ్రెస్ వాళ్లు ఒక్కొక్కరూ ఓటేసినా చాలు రబ్రీ, మీసా... ఇద్దరూ రాజ్యసబ ఎంపీలు అయిపోతారు.
లాలూ జాతీయ స్థాయిలో పనిచేస్తానని ఇంతకుముందు చాలా సార్లు అన్నారు. అయితే ఆయనకు ఏ పదవి లేకపోవడం ఉండేందుకు నివాసం ఢిల్లీలో లేదు. దీంతో ఆయన అక్కడ ఆర్జేడీ ఎంపీ కి ఇచ్చిన నివాసంలో ఉంటున్నారు. ఇప్పుడు భార్యను ఎంపీని చేస్తే... ఆమె మూడు సార్లు సీఎంగా సేవలందించింది కాబట్టి... ప్రభుత్వం పెద్ద నివాసమే కేటాయిస్తుంది. అందులో భార్యతో పాటూ ఉండి ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని లాలూ ప్రసాద్ యాదవ్ భావిస్తున్నట్టు ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి.
Mobile AppDownload and get updated news