జీహెచ్ఎంసీ సమరానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. దీంతో పోలింగ్ ఏర్పాట్లలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది. నగర వ్యాప్తంగా మొత్తం 24 ఈవీఎంల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియం, నిజాం కాలేజీ మైదానంలో శిబిరాలను ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రిని సిబ్బందికి ఇప్పటికే అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరంలో పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలను సిబ్బందికి ఎన్నికల కమిషన్ తెలియజేసింది. అలాగే ఎవరెవరికి ఏఏ కేంద్రాలు కేటాయించారనే వివరాలను తెలియజేశారు. పోలింగ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో సిబ్బంది ఇప్పటి నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. మంగళవారం హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Mobile AppDownload and get updated news