బొంతు రామ్మోహన్... నవ తెలంగాణాలో హైదరాబాద్ తొలి మేయర్‌గా గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడతను నగర ప్రథమ పౌరుడు. రెండు రోజుల నుంచి అతని పేరు నగరంలో ప్రముఖంగా వినిపిస్తోంది. అంతకుముందు... అతనెవరో చాలా మందికి తెలియదు. తెరాస క్యాడర్‌లో మాత్రం గత పదిహేనేళ్లుగా అందరికీ సుపరిచితుడే. ఈ కార్పోరేషన్ ఎన్నికల్లో తెరాస విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఒకటే చర్చ. మేయర్ ఎవరు? అని. గెలిచిన తెరాస కార్పోరేటర్లలో బలమైన రాజకీయ పునాదులున్న వారసులు ఉన్నారు. వాళ్లని కాదని బొంతునే మేయర్ పీఠం వరించింది. కె.కేశవరావు కూతురు విజయలక్ష్మి, దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే నగరానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం బొంతు పేరునే సమర్థించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ కూడా మొదట్నించి తెరాసతోనే ఉన్న ఆ యువ నాయకుడికే పగ్గాలు ఇవ్వడం న్యాయమనుకున్నారు. రామ్మోహన్ తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పటి నుంచి అంటే 2001 నుంచి తెరాసలో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఎప్పుడు కేసీఆర్‌కి వెన్నంటే ఉండేవారు. పార్టీకి నమ్మకంగా ఉండడంతో పాటూ, ఉద్యమ నేపథ్యం అతనికి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇక డిప్యూటీ మేయర్ 34 ఏళ్ల బాబా ఫసియుద్దీన్. తెరాస విద్యార్థి విభాగం హైదరాబాద్ నగర నాయకుడు. ఉద్యమం సమయంలో చాలా సార్లు అరెస్టయ్యాడు. ఇప్పుడు బోరబండ నుంచి కార్పోరేటర్‌గా ఎన్నికయ్యాడు. డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీలకు ఇవ్వాలని ముందే అనుకోవడంతో ... ఆ పదవి ఫసియుద్దీన్‌ను దక్కింది. రాజకీయ వారసత్వం, బలమైన రాజకీయ నేపథ్యం, డబ్బు, హోదాలాంటివేవీ ఈ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎంపికను ప్రభావితం చేయకపోవడం... నిజంగా ఆహ్వానించదగ్గ అంశం.
Mobile AppDownload and get updated news