దేవదాసు: సెల్యూలాయిడ్‌పై ప్రాణం పోసుకున్న ఎన్నో ప్రేమకథల్లో ఓ అద్భుతమైన దృశ్య కావ్యం లాంటిది ఈ సినిమా. 'దేవదాస్' పేరిట ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు తెరకెక్కినప్పటికీ... ఏఎన్నార్ నటించిన దేవదాసు మాత్రం అన్నింటిల్లోకెల్లా ప్రత్యేకమైనదిగా సినీ విమర్శకులు చెబుతుంటారు. ఎన్నో ప్రేమకథలకి రాయని నిఘంటువులా మారిందీ చిత్రం. దేవదాసు ప్రేమ విఫలమైనా... సినిమా మాత్రం ఘన విజయం సాధించింది.
ప్రేమాభిషేకం : టాలీవుడ్‌లో లవ్ స్టోరీలకి కొత్త ట్రెండ్ నేర్పిన సినిమా ప్రేమాభిషేకం అయితే, ఈ తరహా లవ్ స్టోరీలు చేసి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు ఏఎన్నార్. ఆయనకి రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చిపెట్టింది కూడా ఇటువంటి సినిమాలే. కొన్ని థియేటర్లలో 365రోజులకిపైగా విజయవంతంగా నడిచిన సినిమా ఇది.
మరోచరిత్ర : తెలుగు, తమిళ సినిమాకి కొత్త నడకలు నేర్పించిన దర్శకుడు కే బాలచందర్ తెరకెక్కించిన కదిలే బొమ్మల కథే ఈ మరోచరిత్ర. టైటిల్‌కి తగినట్టే, సినీ ప్రపంచంలో మరోచరిత్ర సృష్టించిందీ సినిమా. కమల్ హాసన్, సరిత జంటగా నటించిన ఈ మూవీ అప్పటికీ.. ఇప్పటికీ.. ఇంకెప్పటికీ మర్చిపోలేనన్ని జ్ఞాపకాల్ని అందించింది. తెలుగు భాష తెలియని ఒక తమిళ కుర్రాడు... తమిళం భాష రాని ఓ తెలుగమ్మాయి మధ్య పుట్టిన ప్రేమ ఎన్ని హోయలు పోయింది, ఎన్ని బాధలు అనుభవించింది... చివరకి ఎలా ముగిసింది అనేదే ఈ 'మరోచరిత్ర'. సీతాకోకచిలుక : హిందూ మతానికి చెందిన ఓ యువకుడు, క్రిష్టియన్ యువతికి మధ్య చిగురించిన ప్రేమే ఈ సీతాకోకచిలుక. రెండు వేర్వేరు మతాలకి చెందిన ఈ ప్రేమజంట కథ సుఖాంతం అవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి ? ఆ ఇబ్బందులన్నింటినీ ఆ జంట ఎలా అధిగమించగలిగింది అనేదే ఈ సినిమా కథనం. ఈ లవ్ స్టోరీకి వెన్నెముక కథే అయినప్పటికీ... ప్రాణం పోసింది మాత్రం మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతమే.
గీతాంజలి : తెలుగు సినిమాలన్నింటిల్లోకెల్లా ఆల్ టైమ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఈ గీతాంజలి సినిమా అని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అనారోగ్యంబారినపడి ఇంకొద్ది రోజులకి మించి బతకలేని పరిస్థితుల్లో వున్న ఓ యువజంట మధ్య అనుకోకుండా ఏర్పడిన పరిచయం అంతేవేగంగా ప్రేమగా మారడం.. ఆ తర్వాత ఒకరికోసం మరొకరు తపించిపోవడాన్ని అంత హృద్యంగా తెరకెక్కించడం ఆ సినిమా డైరెక్టర్ మణిరత్నంకే చెల్లిందేమో! వ్యక్తిగతంగా దర్శకుడు మణిరత్నం, కంపోజర్ ఇళయరాజాల ప్రతిభకి ఈ సినిమా ఎప్పటికీ ఓ ఎగ్జాంపుల్‌గా నిలిచిపోయింది. అందుక్ ఆల్ టైమ్ సూపర్ హిట్ లవ్ స్టోరీ అయ్యింది.
అభినందన : ఎంతో గాఢంగా ప్రేమించుకున్న ఓ ప్రేమ జంట కొన్ని అనుకోని కారణాలతో దూరమైపోవడం.. తిరిగి కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఒక్క చోటికి చేరడం.. అనంతరం తనకి తెలియకుండానే ఆ ఇద్దరూ విడిపోవడానికి కారణమైన వ్యక్తే మళ్లీ ఆ ఇద్దరినీ కలపడం కోసం ప్రాణత్యాగం చేయడమే ఈ అభినందన కథాంశం. ఈ రొమాంటిక్, శాడ్ లవ్ స్టోరీని మెలోడియస్‌గా మలిచాడు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా.
ప్రేమ : వెంకటేష్, రేవతి జంటగా నటించిన ఈ సినిమా అంతకు ముందు వచ్చిన ఎన్నో ప్రేమకథల్లాంటిదే. కానీ ఆడియెన్స్ హృదయాల్లో మాత్రం వాటన్నింటికన్నా ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుందీ సినిమా. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎన్నో ప్రేమ కథలకి తనదైన సంగీతంతో ప్రాణం పోసిన ఇళయరాజానే ఈ ప్రేమని కూడా ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ చేయడం.
తొలిప్రేమ : పవన్ కళ్యాణ్‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించిపెట్టిన ఈ సినిమా ఆ తర్వాత వచ్చిన మరెన్నో లవ్ స్టోరీలకి ఓ ప్రామాణికంగా మారింది. లవ్ స్టోరీ అంటే ఇలాగే వుండాలి.. హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలంటే ఇలాగే తెరకెక్కించాలనేంత గొప్పగా 'తొలిప్రేమ'ని మలిచాడు దర్శకుడు కరుణాకరన్. నేటి తరం తెలుగు సినిమాలో ఎవర్ గ్రీన్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఈ 'తొలిప్రేమ'. ఆర్య : లవ్ అనే పదానికి ఓ కొత్త నిర్వచనం చెప్పిన సినిమా ఆర్య. తాను ప్రేమించిన అమ్మాయి సుఖం కోసం, కేవలం ఆమె సౌఖ్యం కోసం తన ప్రేమని త్యాగం చేయడానికి సిద్ధపడే ఓ యువకుడి లవ్ స్టోరీ ఇది. ప్రియురాలి సౌఖ్యం కోసం తన ప్రేమనే త్యాగం చేయడమేంటని ఈ స్టోరీ లైన్‌పై అప్పట్లోనే కొన్ని విమర్శలు వినిపించాయి. కానీ దర్శకుడు సుకుమార్ 'ఆర్య'ని రూపొందించిన విధానం మాత్రం అతడిని మొట్టమొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్స్ జాబితాలో చేర్చింది. లవ్ ఫెయిల్ అయినంత మాత్రాన్నే దేవదాసుగా మారక్కర్లేదనే సందేశాన్ని కూడా యువతకి అందించిందీ సినిమా.
మగధీర : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ తెలుగు సినిమా స్థాయిని పెంచింది. లవ్ స్టోరీ అంటే ఎంతసేపూ కేవలం ప్రస్తుతం, ఫ్లాష్ బ్యాక్‌లే కాదు.. గత జన్మని, పునర్జన్మని కనెక్ట్ చేస్తూ కూడా ఓ అందమైన లవ్ స్టోరీని అల్లుకోవచ్చని నిరూపించాడు రాజమౌళి. 400 ఏళ్ల క్రితం ప్రేమ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఓ ప్రేమ జంట 400 ఏళ్ల తర్వాత తిరిగి పుడితే ఎలా వుంటుదనేదే మగధీర. గతంలో కూడా పునర్జన్మ కాన్సెప్ట్‌తో లవ్ స్టోరీలు తెరకెక్కినప్పటికీ.. అవేవీ ఇంత ఘన విజయాన్ని అందుకోలేదు. కమెర్షియల్‌గా కలెక్షన్లలో టాలీవుడ్ రికార్డులు తిరగరాసిన ఈ లవ్ స్టోరీ రాంచరణ్‌కి కెరీర్ తొలినాళ్లలోనే బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించిందీ సినిమా. తెలుగు సినిమాల్లో ఈ మిలీనియంలో వచ్చిన మొట్టమొదటి విజువల్ వండర్ కూడా మగధీరనే అనుకోవచ్చు. ప్రేమ నేపథ్యంలో వచ్చిన ఇంకెన్నో సినిమాలు ఆడియెన్స్ మనసు దోచుకున్నాయి... సూపర్ హిట్ అయ్యాయి. సినిమా ఎంత పాతదయినా.. ఎన్నిసార్లు చూసినా.. చూసిన ప్రతీసారి ఏదో కొత్తదనం కనిపించడమే ఈ లవ్ స్టోరీల ప్రత్యేకత. అటువంటి మచ్చు తునకల్నే కొన్నింటిని ఇక్కడ మచ్చుకు ప్రస్తావించుకోవడం జరిగింది.
Mobile AppDownload and get updated news