Mobile AppDownload and get updated news
గాంధీజీని మొదటిసారి 'మహాత్మ' అని సంబోధించింది ఎవరు? మనకందరికీ తెలిసిన జవాబు... రవీంద్రనాథ్ ఠాగూర్. కానీ గుజరాత్ ప్రభుత్వం మాత్రం కాదని అంటోంది. ఇప్పుడిదో కొత్త వివాదమయ్యేట్టు కనిపిస్తోంది. పూర్తి వివరాల ప్రకారం... రాజ్ కోట్ జిల్లా పంచాయతీ శిక్షాన్ సమితి రెవెన్యూ ఉద్యోగాల కోసం పరీక్ష పెట్టింది. అందులో గాంధీజీని మహాత్మ అని మొదట ఎవరు పిలిచారు అన్న ప్రశ్న ఇచ్చారు. పరీక్ష అనంతం మొదటి కీని విడుదల చేశారు. ఆ కీలో గాంధీజీని మహాత్మ అని పిలిచింది ఠాగోర్ అని జవాబిచ్చారు. ఫైనల్ కీలో మాత్రం ఓ పేరు తెలియని విలేకరి గాంధీజీకి ఉత్తరం రాస్తూ మొదటిసారి మహాత్మ అని సంబోధించినట్టు చెప్పారు. దీనిపై సంధ్య మరు అనే అభ్యర్థి గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ ప్రశ్నతో పాటూ మరో రెండు ప్రశ్నలకు కూడా జవాబులు మొదటి కీ లో ఒకలా, ఫైనల్ కీలో ఒకలా ఇచ్చారని పేర్కొన్నారు. దేశంలో గంగానదే పొడవైనదని అందరికీ తెలుసు... కానీ బ్రహ్మపుత్ర అని ఫైనల్ కీలో ఇచ్చారు. దీనిని కూడా పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాజ్ కోట్ జిల్లా పంచాయతీ లాయర్ ని 'గాంధీజీని మహాత్మ అని పిలిచిన వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారు' అని అడిగారు. దానికి లాయర్ తనకు ఠాగోర్ అనే తెలుసని, పిల్లలకు అలాగే బోధిస్తానని చెప్పారు. అనంతరం కోర్టు జిల్లా ఉద్యోగాల రిక్రూటింగ్ ఏజెన్సీని ఎందుకలా జవాబులు మార్చారో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 17కి వాయిదా వేసింది.