కాశ్మీర్‌ని చేజిక్కించుకోవడానికి పాక్ ఎన్ని పన్నాగాలు పన్నుతుందో... వేర్పాటువాదులను ఎంతగా రెచ్చగొడుతుందో అందరికీ తెలుసు. అయితే పాక్ ఇటీవల ఆ విషయంలో చాలా రియలైజ్ అయింది. కాశ్మీర్‌ని కష్టపడి కుట్రలు పన్ని ఎందుకు లాక్కోవడం... జెఎమ్‌యూ (యూనివర్సిటీ పేరు మార్చాం) విద్యార్థులు ఉన్నారుగా... వాళ్లే తెచ్చి పెడతారు అని సంబరపడుతోంది. కాశ్మీర్ వేర్పాటువాదుల స్థానంలో జెఎమ్‌యూ విద్యార్థులని నియమిస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది. పాకిస్తాన్ ప్రధాని ఆఫీసు అధికారులు ఈ విషయాన్ని హురియత్ నేతలకు కూడా చెప్పారు. 'వాళ్లు (జెఎమ్‌యూ విద్యార్థులు) మన పాకిస్తాన్ క్రికెట్ టీం కన్నా బాగా గొడవలు పడుతున్నారు. వేర్పాటువాదులు ఇన్నేళ్లుగా కాశ్మీర్ లోని స్థానికులతో ఇండియన్ ఆర్మీ మీద రాళ్లేయించడంలో విజయం సాధించారు' అని ఎద్దేవా చేశారు. న్యూఢిల్లీలో ఉండి ఆ విద్యార్థులు కాశ్మీర్ స్వతంత్రత కోసం పోరాటం చేస్తున్నారని, ఇదే మంచి ప్రభావం చూపిస్తుందని పాక్ అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే తమ వేర్పాటువాదులను అరవింద్ కేజ్రీవాల్ తో పోల్చింది పాక్. అరవింద్ కేజ్రీవాల్ మోడీ తనను పనిచేయనివ్వడం లేదని ఆరోపించినట్టు వేర్పాటువాదులు కూడా మాట్లాడుతున్నారంది. వీరినిప్పుడెవరు పట్టించుకుంటారు? ఆ విద్యార్ధులు చాలు ఇండియాని షేక్ చేయడానికి అని పాక్ ఆర్మీ చీఫ్ అన్నారు.
పాక్ ఐఎస్ఐ అధికారి మాట్లాడుతూ 'అసలు అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్లను ఉరితీసినందుకు మేం కూడా అంత ఫీలవ్వలేదు.... కానీ జెఎమ్‌యూ విద్యార్థులు మాత్రం తెగ బాధపడిపోతున్నారు' అని అభిప్రాయపడ్డారు. ఈ విద్యార్ధులు చేస్తున్న పోరాటానికి కొంత మంది జర్నలిస్టులు, రాజకీయనాయకుల మద్దతు కూడా ఉంది... కనుక కాశ్మీర్‌ని పాక్ కి ఇచ్చే విషయంలో సానుకూల వాతావరణం ఏర్పడి... త్వరలో కాశ్మీర్ పాక్ లో భాగమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా పాకిస్తాన్ పెద్ద మనిషి హఫీజ్ సయిూద్ జెఎమ్‌యూ విద్యార్థులలో కొంత మందిని కంటెంట్ రైటర్లుగా తీసుకుంటే బాగుంటుందని అంటున్నాడు. ఎందుకంటే 'కాశ్మీర్ కి ఆజాది తక్ జంగ్ చలేగీ... భారత్ కి బర్బాది తక్ జంగ్ చలేగి... పాకిస్తాన్ జిందాబాద్'... ఇలా వాక్యాలు రాయడంలో వాళ్లు దిట్టలా కనిపిస్తున్నారు. అలాంటి క్యాప్షన్లు రాస్తే వాళ్లు మాకు కావాలి అంటున్నాడు సయీద్.
Mobile AppDownload and get updated news