ఇప్పటికే జాతి వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణలతో జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్ గత కొద్ది రోజులుగా అట్టుడికిపోతోంటే తాజాగా ఓ బీజేపీ నేత అదే యూనివర్శిటీపై మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. రాజస్థాన్‌లోని రామ్‌ఘర్ నియోజకవర్గానికి చెందిన గ్యాన్‌దేవ్ అహుజా అనే బీజేపీ ఎమ్మెల్యే జేఎన్‌యూ స్టూడెంట్స్ తీరుపట్ల మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. జేఎన్‌యూలో చదువుకొంటున్న యువత సెక్స్‌కి, డ్రగ్స్‌కి అలవాటుపడ్డారని అన్నారు అహుజా. పగలంతా ఆందోళనల్లో పాల్గొంటున్న యువత చీకటయితే చాలు డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్నారు. రాత్రి 8 తర్వాత క్యాంపస్‌లోనే డ్రగ్స్ పుచ్చుకుని, నగ్నంగా నృత్యాలు చేస్తున్నారు. క్యాంపస్ ఆవరణలో 10,000కిపైగా సిగరెట్ పీకలు, 4,000కిపైగా బీడీ ముక్కలు లభించాయి. 50,000 ఎముకలు దొరికాయి, 2000 వరకు చిప్స్, మిక్చర్ పొట్లాలు, 3000 వరకు వాడిపడేసిన కండోమ్స్ కనిపించాయి. మరో 500 గర్భనిరోధక ఇంజెక్షన్లు లభించడం చూస్తోంటే అక్కడ ఏం జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో చదువుకుంటున్న వాళ్లంతా పిల్లలేమీ కాదు.. ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు అంటూ వారి యుక్త వయస్సుని ఎత్తి చూపించారు అహుజా. అహుజా చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు జేఎన్‌యు వర్గాల్లో చర్చనియాంశమయ్యాయి.
Mobile AppDownload and get updated news