అందరూ ఊహించినట్లే బీహార్ రాజకీయాలు సాగుతున్నాయి. బీహార్ ఉప ముఖ్యమంత్రి పీఠం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికే అని రూఢీ అయిపోయింది. అత్యంత విశ్వసనీయ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపిన సమాచారం ప్రకారం లాలూ ఇద్దరు కుమారులు తేజశ్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లు నితీశ్ కుమార్ క్యాబినెట్లో మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. తేజశ్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఇక మిగిలిన మంత్రివర్గ శాఖల విషయానికి వస్తే కీలకమైన పోస్టులన్నీ లాలూ పార్టీకే అని అంటున్నారు. లాలూ విధేయుడు అబ్దుల్ బారీ సిద్ధిఖీ ఆర్థిక మంత్రి పదవి ఖాయమైంది. ఈ నెల 20వ తేదీ (శుక్రవారం)నాడు నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో, మాజీ ప్రధాని దేవెగౌడ, శరద్ పవార్ హాజరవుతున్నారు. వీరితో పాటు భాజపా అసంతుష్ట నేతలు కూడా హాజరయ్యేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Mobile AppDownload and get updated news