Mobile AppDownload and get updated news
ఏపీకి కేంద్రం అన్ని రకాలుగా సాయపడుతోందని అందులో ఎటువంటి సందేహం అక్కరలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసారు. ఆంధ్రులకు తాము అన్యాయం చేయబోమనే సంగతిని తెలియజేయడానికే తాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చానని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో సంకల్ప ర్యాలీ అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవడం లేదని దుష్ప్రచారం జరుగుతోందని చెప్పారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదంటూ తమ ప్రభుత్వం ఆంధ్రాకు చేసిన కార్యక్రమాలను ఏకరువు పెట్టేయత్నం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలంగాణలోని ముంపు మండలాలను కలపడం దగ్గర నుండి పలు అంశాలను ప్రస్తావించారు. పోలవరం పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం చిత్త శుద్దితో ఉందని, తమ సంకల్పాన్ని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ప్రసంగం ఆద్యంతం హిందీలో సాగగా దాన్ని బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రిణి దగ్గుబాటి పురంధేశ్వరి తెలుగులోకి అనువదించారు.