వరంగల్ లోక్ సభకు జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. మొత్తం 22 రౌండ్లు గా లెక్కింపు జరుగుతోంది. అయితే కేవలం మొదటి పది రౌండ్లు పూర్తయ్యే సరికే టీఆర్ఎస్ కు మూడు లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక మిగతా రౌండ్లు పూర్తయితే ఆ మెజారిటీ అయిదు లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో అక్కడ పోటీచేసిన కడియం శ్రీహరికి 3,92,137 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఆధిక్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి రౌండ్ నుంచి ప్రతి రౌండ్ లోనూ తెరాసకు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు... కనీసం తెరాస దరిదాపులకు రాలేకపోతున్నారు. ప్రతి రౌండ్లో తేడా ముప్పయివేలు కనిపిస్తోంది. ప్రతి రౌండ్ లోనూ 62 శాతం ఓట్లు తెరాసకే పడుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే తెరాస శ్రేణులు విజయోత్సవ ర్యాలీలు ప్రారంభించేశారు.
Mobile AppDownload and get updated news