ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ప్రస్తుతం ఉన్న భద్రత సరిపోదని ఢిల్లీ పోలీసులు తేల్చారు. కేజ్రీవాల్ ను మరో గంటలో పేల్చివేస్తానంటూ ఆగంతకుడు ఒకరు ఆయన నివాసానికి బెదిరింపు ఫోన్ కాల్ చేయడమే దానికి కారణం. ఫోన్ కాల్ వచ్చిన సమయంలో కేజ్రీవాల్ అసెంబ్లీలో ఉన్నారు. దాంతో కంగారుపడిన కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని సచివాలయ అధికారులు పోలీసులకు తెలియచేసారు. బెదిరింపు ఫోన్ కాల్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి ఆయన ఇంటివద్ద, సచివాలయం వద్ద, అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బుధవారం సాయంత్రం ఫోన్ చేసిన ఆగంతకుడు ఢిల్లీ సీఎంను మరొక గంటలో పేల్చివేయబోతున్నానని, మీరు ఆయనను ఎలా కాపాడుకోవాలనుకుంటారో కాపాడుకోవడానికి ప్రయత్నించుకోవచ్చు అంటూ సవాల్ విసిరాడు. ఆ ఫోన్ కాల్ ను సదరు ఆగంతకుడు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (విఓఐపీ) ద్వారా చేసాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని నిర్ణయించారు.
Mobile AppDownload and get updated news