కేరళ రాష్ట్రం, కొల్లాంలోని పరావూర్ పుట్టింగల్ దేవాలయంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య వంద దాటింది. ఈ తెల్లవారు జామున విషు వేడుకల సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో బాణాసంచా ప్రదర్శన కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 84మంది అని భావించారు. కానీ, కొద్ది గంటల తరువాత ఈ సంఖ్య పెరిగింది. దేవాలయం వద్ద అగ్నిప్రమాదానంతర శిధిలాల కింద మృతదేహాలను పోలీసులు, ఇతర రక్షక సిబ్బంది కనుగొన్నారు. దక్షిణాదిలోని ప్రముఖ హిందూ దేవాలయాల్లో పరావూర్ దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ జరిగే విషు వేడుకల్లో పాలుపంచుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. విషు ఉత్సవం సందర్భంగా జరుపతలపెట్టిన బాణాసంచా పేలుడు ప్రదర్శనకు తమ అనుమతిలేదని అగ్నిమాపక శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 102 మంది మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. 250 మందికి పైగా భక్తులు గాయపడి చికిత్స పొందుతున్నారు.
Mobile AppDownload and get updated news