విజయ్ మాల్యా పాస్‌పోర్ట్ ను భారత విదేశాంగ శాఖ రద్దు చేసింది. ప్రభుత్వ బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయిలను రుణాలుగా పొంది వాటిని తీర్చకుండా ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆరోపణలను విజయ్ మాల్యా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని వివిధ కోర్టుల్లో ఆయనపై కేసులు చాలా పెండింగులో ఉన్నాయి. ఆర్థిక నేరాలను విచారించే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఇప్పటికి మూడు సార్లు మాల్యాకు నోటీసులు పంపింది. తన ఎదుట విచారణకు హాజరవ్వాలని ఆదేశించినా వాటిని మాల్యా పెడచెవిన పెట్టారు. ఒకవైపు ఈడీ నోటీసులకు స్పందించకపోయినప్పటికీ, రహస్య ప్రాంతంలోనుండి ట్విట్టరు ద్వారా మాత్రం మాల్యా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. తనకు భారత చట్టాలంటే గౌరవముందని వాటి ఆదేశాలను శిరసావహిస్తానని కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తమ నోటీసులను పెడచెవిన పెడుతున్న మాల్యా పాస్‌పోర్ట్ రద్దు చేయాలని ఈడీ అధికారులు విదేశాంగ శాఖను ఇటీవల కోరారు. దాంతో ఆయన పాస్‌పోర్ట్ రద్దు చేస్తూ శుక్రవారం నాడు విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. రూ.9200 కోట్ల మేరకు వివిధ బ్యాంకులకు మాల్యా బకాయిపడ్డారని లెక్క.
Mobile AppDownload and get updated news