బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ని లీగల్ ట్రబుల్స్ ఇప్పుడప్పుడే విడిచిపెట్టేలా లేవు. సినిమా షూటింగ్ సెట్స్‌లోకి వెళ్లడం, రావడం ఎంత మామూలో కోర్టుకి వెళ్లడం, రావడం కూడా మరీ ఈమధ్య కాలంలో సల్మాన్‌కి అంతే మామూలైంది. ప్రస్తుతం సల్మాన్ పరిస్థితి గమనిస్తే, ఇకపై అతడికి ఈ కోర్టు చిక్కులు మరింత అధికం అయ్యేలా కనిపిస్తోంది. 1998లో హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్‌కి వెళ్లి రాజస్థాన్‌లో క్రిష్ణజింకల్ని వేటాడి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో సల్మాన్ దోషి అని నిరూపించే విధంగా ప్రాసిక్యూషన్ గట్టి చర్యలే తీసుకుంటోంది. సూరజ్ భర్జత్యా దర్శకత్వంలో తెరకెక్కిన హమ్ సాత్ సాత్ హై మూవీ షూటింగ్ కోసం సహనటులు సైఫ్ అలీ ఖాన్, సొనాలి బింద్రె, టబులతో కలిసి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వెళ్లిన సల్మాన్ ఖాన్ అక్కడి నుంచి ఉజాలియా బాకర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఉజాలియా బాకర్ వెళ్లేందుకు మారుతి జిప్సీ వాహనం డ్రైవ్ చేయడంతోపాటు వేట, హత్య ఆరోపణల్లోనూ సల్మాన్ ఖాన్ ప్రధాన నిందితుడు అని సాంకేతికంగా నిరూపించేటటువంటి శాస్త్రీయ ఆధారాల్ని అక్కడి ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ టీమ్ సేకరించింది.
ఈ కేసుకి సంబంధించి అటవీ శాఖ అధికారుల స్వాధీనంలోనే వున్న జిప్సీ వాహనం టైర్ల అచ్చుల్లోని మట్టి ఆనవాళ్లతో, ఘటనా స్థలంలో సేకరించిన మట్టి శాంపుల్ల ఆనవాళ్లు, టైర్ల అచ్చులు సరిపోవడం వంటివి సల్మాన్‌ని లీగల్‌గా ఇబ్బంది పెట్టే పరిణామాలుగా తెలుస్తోంది. వీటికితోడు ఈ కేసులో సల్మాన్ ఘటనా స్థలికి వెళ్లినట్టుగా చెబుతున్న ప్రధాన సాక్షి హరీష్ దులానీని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం తమకి రాలేదంటూ సల్మాన్ తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణకి దులానీ కూడా కోర్టులో హాజరు కానున్నారు. క్రితంసారి కోర్టుకి హాజరైన సల్మాన్ ఖాన్ ఈసారి కోర్టుకి రాలేదు. మరి ఇంతటితో ఈ కేసు సల్మాన్ ని విడిచిపెడుతుందా లేక మరింత జఠిలం అవుతుందా మున్ముందు జరగనున్న కోర్టు విచారణలే తేల్చనున్నాయి.
Mobile AppDownload and get updated news