ఇండియా-చైనా మధ్య గల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సరిహద్దు రేఖ వెంబడి ఆనుకుని వున్న గ్రామాలని కొంతమంది గుర్తు తెలియని గూఢచారులు వరుస ఫోన్ కాల్స్‌తో వేధిస్తున్నారు. సరిహద్దుల వెంట పహారా కాస్తున్న ఇండియన్ ఆర్మీ కదలికలపై గ్రామస్తుల నుంచి ఆరా తీస్తున్నారు. సైనికుల రాకపోకలు, వారు విధులు నిర్వహించే సమయాలు, అక్కడి రహదారి వ్యవస్థల గురించి ఫోన్‌లో అడిగి తెలుసుకుంటున్నారు. తమని తాము స్థానిక అధికారులుగా పరిచయం చేసుకుంటున్నప్పటికీ... ఆయా ఫోన్ కాల్స్ పాకిస్థాన్, చైనా నుంచి వస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సరిహద్దుని ఆనుకుని వున్న దర్బక్ అనే గ్రామానికి చెందిన సర్పంచ్‌కి ఫోన్ చేసిన ఓ వ్యక్తి కూడా ఇవే వివరాలు ఆరాతీయడంతోపాటు సైనికులతో వున్న వివాదాలు పరిష్కారం అయ్యాయా అని అడిగాడు. అయితే, సరిగ్గా అదే సమయంలో ఆర్మీ శిబిరంలో కూర్చుని వున్న ఆ గ్రామ సర్పంచ్‌కి ఫోన్ చేసిన వ్యక్తిపై అనుమానం కలిగి అతడి గురించి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తనని తాను స్థానిక డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో పనిచేస్తున్న అధికారిగా పరిచయం చేసుకున్నాడు ఆ ఫోన్ చేసిన వ్యక్తి. కానీ అతడి మాటలపై అనుమానం రావడంతో ఆ తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆఫీసుకి వెళ్లి ఆ అధికారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా... అసలు అటువంటి ఫోన్ నెంబర్ నుంచి తామెవ్వరం ఫోన్ చేయలేదని డిప్యూటీ కమిషనర్ ఆఫీసు సిబ్బంది సమాధానం ఇచ్చారు.
![]()
అనంతరం ఆ ఫోన్ కాల్ కంప్యూటర్ ఆధారిత కాల్‌గా ఆర్మీ అధికారులు తేల్చారు. ఇటువంటి కాల్స్ సరిహద్దు గ్రామాల్లో చాలామందికి వస్తున్నట్టు ఆర్మీ అధికారుల పరిశీలనలో తేలింది. అసలు విషయం తెలియని ఇంకొంతమంది గ్రామస్తులు కాలర్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పినట్టుగాను తెలిసింది. దీంతో ఇకపై ఎవ్వరికి, ఎలాంటి సమాచారం అందించవద్దంటూ ప్రభుత్వం సహాయంతో సరిహద్దు గ్రామాల ప్రజలకి అవగాహన శిబిరాలు నిర్వహిస్తోంది ఆర్మీ. మరీ ముఖ్యంగా పాకిస్థాన్, చైనాలతో సరిహద్దు కలిసి వున్న ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధుల వద్ద ఆర్మీ, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ వ్యవస్థల గురించి ఎక్కువ సమాచారం వుంటుంది కనుక సదరు గూఢచారులు వారిని సైతం ట్రాప్ చేసే అవకాశం వుందని భావిస్తున్న ఆర్మీ ఇప్పుడు వారిని చైతన్యవంతుల్ని చేసే పనిలో నిమగ్నమైంది.
Mobile AppDownload and get updated news