Mobile AppDownload and get updated news
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో చిక్కుకుని మూడు వారాలు కాకముందే బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణి తలకు మరో కేసు చుట్టుకుంది. ఆమెకు డ్రగ్స్ రాకెట్ తో పాటు మనీ లాండరింగ్ వ్యవహారంలో కూడా పాత్ర ఉందని ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మమతా కులకర్ణి భర్తకు స్మగ్లరుగా దేశ విదేశాల్లోని డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. విదేశాల్లో ఉంటున్న అతగాడు భారతదేశంలో తన భార్య మమతా కులకర్ణి ద్వారా డ్రగ్స్ రాకెట్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడని పోలీసులు భావిస్తున్నారు. మూడు వారాల క్రితం థానేలో పట్టుపడిన 20 టన్నుల ఎఫెడ్రైన్ వ్యవహారంలో తీగ లాగితే మమతా కులకర్ణి పేరు బయటకు వచ్చింది. ఈ విషయాన్ని ముంబై మిర్రర్ వెలుగులోకి తెచ్చింది. ఈ సందర్భంగా ఆమె బ్యాంకు ఖాతాలను పోలీసులు తనిఖీ చేయగా విదేశాల నుండి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయిల సొమ్ము ఆమె ఖాతాలోకి పరవళ్లు తొక్కినట్లుగా జమ అవుతున్న విషయం తెలిసింది. ఆ సొమ్మును బాలీవుడ్ ప్రముఖుల్లో పలువురు హవాలా మార్గంలో మళ్లించి రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు ఇద్దరు బాలీవుడ్ ప్రముఖ పంపిణీదారులను, ఫిల్మ్ ఫైనాన్సియరును కూడా పోలీసులు విచారిస్తున్నారు.