ఓ ఉద్యోగికి దాదాపు 20 ఏళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత అతనిపై పడిన అవినీతి మచ్చ తొలగిపోయింది. ఇప్పుడు మళ్లీ తన ఉద్యోగం తిరిగి ఇప్పించమని కోరుతున్నారాయన. పూర్తి వివరాల్లోకి వెళితే... అహ్మదాబాద్‌కు చెందిన డికె మినా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో పనిచేసేవారు. 1995వ సంవత్సరంలో ఆయన రూ. 2000 వేలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావటంతో ఉన్నతాధికారులు సర్వీస్ నుంచి తొలగించారు. కేసు కోర్టుకు చేరింది. కోర్టు కూడా ఆయనను దోషిగా తేల్చి రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. చేయని తప్పుకు బలైపోయిన మినా తనపై పడిన అవినీతి మచ్చను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పట్నించి న్యాయపోరాటం ప్రారంభించారు. కోర్టును ఆశ్రయించి తన అమాయకత్వాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించారు. అయితే ఇదంతా చేయడానికి 20 ఏళ్ల కాలం పట్టింది. కోర్టు తాజాగా ఆయన అవినీతి చేయలేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు మినా వయసు 52 ఏళ్లు. ఇంకా ఆయనకు ఎనిమిదేళ్ల సర్వీసు ఉంది. కోర్టు ఇచ్చిన తీర్పు వినగానే మినా ఇలా స్పందించారు... ' ఇప్పుడు నాకు నవ్వాలో? ఏడవాలో తెలియడం లేదు. ఈ ఇరవై సంవత్సరాలు సర్వీసును కోల్పోయాను, నాకున్న మంచి పేరును కోల్పోయాను, అవినీతిపరుడనే మచ్చతో నా కూతురుకి పెళ్ళి సంబంధాలు రాలేదు. నాతో పనిచేసిన నా జూనియర్స్ అందరూ ఇప్పుడు నాకు సీనియర్స్ అయ్యారు, ఏదైతేనేం చివరకు నేను అవినీతిపరుడిని కాదు అని రుజువైంది" అంటూ భావోద్వేగానికి గురయ్యారు. కనీసం ఇప్పుడైనా ఉద్యోగం తిరిగి వస్తే తాను ఇంకో ఎనిమిదేళ్ళ పాటూ సర్వీసులో కొనసాగే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నారు.
Mobile AppDownload and get updated news