Mobile AppDownload and get updated news
అతగాడు ఒకప్పుడు హార్డ్ వేర్ ఇంజనీర్.. అంతేకాదు తైక్వాండో బ్లాక్ బెల్ట్ విజేత.. కానీ ఇప్పుడు అతని పేరు చెపితే దక్షిణ ఢిల్లీ పరిసరాల నివాసులు తమ వస్తువులు ఎక్కడపోతాయోనని బెంబేలెత్తిపోతుంటారు. చివరకు పోలీసులకు బుధవారం నాడు చిక్కాడు. అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంగా అతగాడి వివరాలను విలేకరులకు తెలిపారు. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో ఈ మధ్య దొంగతనాలు పెచ్చుమీరిపోయాయి. ఇంటి ముందు నిలిపిన వాహనాలు మాయమైపోతున్నాయి. ఎన్ని పిర్యాదులు చేసినా పోలీసులకు దొంగను పట్టుకోలేకపోయారు. చివరకు ఒకరోజు అతగాడు చిక్కాడు. వారి చేతిలో దొంగతనానికి గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. తన ఇంటిని దోచుకున్న తరువాత దొంగలు హోండా అకార్డ్ కారులో పారిపోయారని గుర్తులతో సహా బాధితుడు చెప్పాడు. ఆ గుర్తుల ప్రకారం జాతీయ రహదారిపై కాపు కాసి చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఆ దొంగ తన వివరాలను చెప్పాడు. సూరజ్ అనేది అతని పేరు. తైక్వాండో క్రీడాకారుడు. హార్డ్ వేర్ ఇంజనీరింగ్ చేసాడు. బెంగలూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ, జీతం తక్కువని మానేశాడు. ఢిల్లీకి చేరుకుని చదువు మధ్యలో మానివేసిన కొందరితో కలిసి జట్టుకట్టాడు. తొలుత చిన్న చిన్న దొంగతనాలతో మొదలెట్టి.. ఆ తరువాత పెద్ద నేరాలను చేయడం ప్రారంభించారు. మహిళల మెడల్లో చైన్లను లాక్కోవడం, ఇళ్లకు కన్నాలు వేయడం, ఇంటిముందు పెట్టిన వాహనాలను కాజేయడం లాంటివి నిత్యకృత్యంగా చేసుకున్నారు. విమానాశ్రయాల నుండి పెద్ద ఎత్తున నగలను ధరించి వచ్చే మహిళలు, వ్యాపారస్తులను బెదిరించి దోచుకునేవారు. దొంగతనానికి పాల్పడిన ప్రతీసారి హోండా అకార్డ్ కారులో పారిపోయేవారు. చివరకు ఆ కారే వారిని పట్టించింది.