Mobile AppDownload and get updated news
చెన్నై నగరాన్ని అస్తవ్యస్తం చేసి..దాని రూపురేఖలనే మార్చేసిన వర్షాలు, వరదల ప్రభావం ఐటీ సంస్థల మీద కూడా పడింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తోన్న అనేక ఐటీ కంపెనీలు ఈ ప్రకృతి బీభత్సం వలన భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. భారీ టర్నోవర్ కలిగిన ఐటీ కంపెనీలకు ఈ బీభత్సం వలన 40-50 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లి ఉండవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే మిడ్ సైజ్ కంపెనీలు దాదాపు 5-10 మిలియన్ డాలర్ల నష్టాన్ని పొందాయని అంచనా. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి సంస్థలు పని ఆగకుండా ఉండేందుకు చెన్నై నుంచి ఉద్యోగులను తక్షణం బెంగళూరుకి పంపిస్తున్నాయి. దాదాపు 2000 మంది ఐటీ ఉద్యోగులు ఈ రెండు రోజుల్లో బెంగళూరుకి చేరుకున్నారని సమాచారం. అలాగే చెన్నై శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్టేటస్ తెలుసుకోవడం కోసం పలు ఐటీ కంపెనీల హెచ్‌ఆర్ విభాగాలు ప్రయత్నిస్తున్నాయి. పలువురు ఉద్యోగులు ఇంకా వర్షాల తాకిడికి ఇంటి పట్టునే ఉన్నారు. ఐటీ కంపెనీలను పక్కన పెడితే..చెన్నై వరదల ప్రభావం ఆటోమొబైల్ రంగం మీద కూడా బాగానే పడింది. దాదాపు ఈ రంగానికి 15000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. ఇవేకాక, చిన్న,మధ్య తరహా సంస్థలు, చేనేత పరిశ్రమలతో పాటు పర్యాటక రంగానికి కూడా భారీగా నష్టం వాటిల్లిందని నిపుణులు చెబుతున్నారు.