పదహారేళ్ల పాటూ నిరాహరా దీక్ష చేస్తున్న మణిపూర్ ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిల మంగళవారం నుంచి తన దీక్షను విరమిస్తున్నారు. ఆమె గతంలోనే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆత్మహత్యయత్నం కేసులో జైలులో ఉన్న ఆమెను నేడు కోర్టులో ఆమెను హాజరుపరుస్తారు పోలీసులు. అనంతరం ఆమె దీక్షను నిలిపివేస్తున్నట్టు ప్రకటిస్తారు. అంతేకాదు ఆమె పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తన బాయ్ ఫ్రెండ్ దేశ్ మాండ్ కౌంటిన్హో ని (53) ఆమె వివాహమాడనున్నారు. 44 ఏళ్ల షర్మిల 2000 సంవత్సరంలో నవంబర్ 5న నిరాహార దీక్షను చేపట్టారు. అప్పుడామె వయసు 28 ఏళ్లు. ఆ సమయంలో అస్సాం రైఫిల్స్ 10 మంది సాధారణ ప్రజలని కాల్చి చంపారు. వారిలో జాతీయ సాహస బాలుడు అవార్డు అందుకున్న అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ సంఘటన ఆమెని తీవ్రంగా కలచి వేసింది. సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ నిరాహార దీక్షకు దిగారు షర్మిల. అప్పట్నించి వైద్యులు ఆమె శరీరంలోకి నేరుగా ఎక్కిస్తున్న సెలైన్, ఇతర ద్రవాల వల్లే ఆమె ప్రాణం నిలిచింది. ఈ 16 ఏళ్లలో ఆమె ఒక్కసారి కూడా తల దువ్వుకోలేదు, అద్దంలో తన ముఖం చూసుకోలేదు. తల్లిని కూడా అనుకోకుండా ఒక్కసారి మాత్రమే కలుసుకున్నారు. కాగా త్వరలో మణిపూర్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆమె దీక్ష నిలిపివేస్తున్నట్టు పదిరోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే.
![]()
Mobile AppDownload and get updated news