Mobile AppDownload and get updated news
ఏపీ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన మూడో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అనంతపురంలో నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించారు. భారతదేశం సర్వ స్వతంత్ర్య దేశమై 70 ఏళ్లు గడిచిన సందర్భంగా వేడుకలను వైభవంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు జెండాను ఎగురవేశాక... రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అనంతపురంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాయలసీమలో పుట్టిన అన్నమయ్య, వేమన, బళ్లారి రాఘవ, పుట్టపర్తి సాయిబాబా... ఎంతో ఖ్యాతి గడించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒకప్పుడు కరవుకు పర్యాయపదంగా ఉన్న అనంతపురాన్ని తమ ప్రభుత్వ హయాంలో విద్యా,పారిశ్రామిక రంగాల్లో ఉన్నత స్థాయికి చేర్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. తాము అధికారంలో ఉన్న 1994-2004 వరకు రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని, అనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అభివృద్ధిని కొనసాగించలేకపోయిందన్నారు. అదే అదనుగా కుట్రపూరిత రాజకీయాలతో సువిశాల తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించారని అన్నారు. ఏపీని కనీసం రాజధాని కూడా లేకుండా... రోడ్డు మీద పడేశారని అన్నారు. రాజధాని, నిధులు, పరిశ్రమలు లేకుండా ఏపీ దిక్కుతోచని పరిస్థితిలో పడిందని తెలిపారు. రాష్ట్రం విభజించేప్పుడు చేసిన హామీలన్నీ కేంద్రం తీర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ప్రస్తుతం ఆ విషయంపై చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నింటినీ తెప్పిస్తానని... ఒక్క పైసా కూడా వదిలి పెట్టనని అన్నారు. తమ పోరాటానికి ప్రజల మద్దతు కూడా కావాలని అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగానే నడిపిస్తామని అన్నారు. 2022 నాటికి ఏపీ టాప్ 3 రాష్ట్రాల్లోకి చేరుస్తానని హామీ ఇచ్చారు. 2029 నాటికి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తానన్నారు.