Mobile AppDownload and get updated news
అందరూ భయపడుతున్నట్లే అయింది. ప్రపంచ దేశాల హితోక్తులూ, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా తాను అనుకున్నది సాధించినట్లు ప్రకటించింది. తాజాగా ఆ దేశం హైడ్రోజన్ బాంబును తయారుచేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఉత్తర కొరియా పత్రికలు వెల్లడించాయి. ఉత్తర కొరియాలో మానవ హక్కులు అత్యంత ఘోరంగా అణచివేతకు గురవుతున్నాయని ఐక్యరాజ్యసమితి ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఒకటి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన నివేదికలో ఉత్తర కొరియాను అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానానికి ఈడ్వాలని సూచించింది. అలా సూచించిన మరుసటి రోజే ఉత్తర కొరియా నుండి అణుబాంబు తయారీ వార్తలు రావడం గమనార్హం. అయితే, ఇది కేవలం తమ దేశంపైకి ఎవరూ దాడికి దిగకుండా.. మిగతా ప్రపంచాన్ని భయపెట్టేందుకే ఉత్తర కొరియా నాయకత్వం ఇలా హైడ్రోజన్ బాంబు తయారీ అంశాన్ని తెరపైకి తెచ్చిందని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అంతకు మించి ఆ దేశానికి సీను లేదని అంటున్నారు. కానీ, ఉత్తర కొరియా పత్రికల వార్తలను బట్టి చూస్తే, ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఈ ప్రకటన చేసారు. ఆ దేశంలోని ఒక ఆయుధాగారాన్ని సందర్శించిన సందర్భంగా కిమ్ జోంగ్ మాట్లాడుతూ తమ దేశం అమ్ముల పొదిలో అత్యంత శక్తిమంతమైన అణుబాంబు, హైడ్రోజన్ బాంబులు చేరాయని చెప్పినట్లు ఆ పత్రికలు కథనాలు రాసాయి.