ఉదాహరణకి ఈ ఫోటోలో ఎడమవైపు కనిపిస్తున్న ధర్మేంద్ర సింహ్ వాఘేలా అనే వ్యక్తికి నగదు, బంగారం కలిపి రూ.2 కోట్ల బ్యాంకు డిపాజిట్లున్నాయి. వాటిపై ధర్మేంద్ర పొందుతున్న వడ్డీనే రూ.60,000గా వుంది. కానీ ధర్మేంద్ర మాత్రం అక్కడే ఓ కంపెనీలో రూ. 15,000 వేతనంతో గ్రైండింగ్ మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇక ఇక్కడ కనిపిస్తున్న మరో వ్యక్తి పేరు జగదీష్ రాథోడ్. ఓ కంపెనీలో స్టోర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జగదీష్ నెలవారీ జీతం రూ.12,000 మాత్రమే. కానీ అతడి బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం అక్షరాల కోటిన్నర రూపాయలు. ఖరీదైన కార్లు, లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, రాజభవంతిలాంటి నివాసాలు ఇక్కడి కార్మికుల సొంతం. ఆరేడేళ్ల క్రితం వరకు వీళ్లంతా అందరిలాగే సామాన్యులు. కానీ ఇక్కడి పరిశ్రమలకి అమ్ముకున్న భూములే వారిని రాత్రికిరాత్రే కోటీశ్వరులని చేశాయి. అంతా బాగానే వుంది కానీ ఇంతకీ ఇదంతా ఎక్కడి సీన్ అనే కదా మీ డౌట్! అక్కడికే వస్తున్నాం... గుజరాత్‌లోని అహ్మెదాబాద్‌కి సమీపంలోని సనంద్ ఇండస్ట్రియల్ ఏరియాతోపాటు ఆ చుట్టుపక్కల వున్న గ్రామాల్లో కనిపించే పరిస్థితి ఇది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గుజరాత్ ఇండస్ట్రియల్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఎస్టేట్‌లో వున్న అన్ని పరిశ్రమల్లో ఈ కోటీశ్వరులెంతో మంది వాచ్‌మెన్లుగా, సెక్యురిటీ గార్డులుగా, మెషిన్ ఆపరేటర్లుగా చిన్నచిన్న జీతాలకి పనిచేస్తున్నారు. వారికున్న ఆస్తుల ముందు ఈ జీతాలు అసలు లెక్కే కాదు. కాకపోతే ఖాళీగా ఇంట్లో కూర్చునేకన్నా ఇలా ఏదో ఓ పని చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే తాము పనిలోకి వస్తున్నామని చెబుతున్నారు వారు. అప్పటివరకు అందరిలాగే ఫ్యాక్టరీ పనులకి పోయినవాళ్లు కూడా తమ భూములు అమ్ముకోగా వచ్చిన కోట్ల రూపాయలతో ఏదో ఓ వ్యాపారం చేసుకుంటూ, పాత పనులు మానేసి దర్జాగా విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న వాళ్లూ వున్నారు. ఇలా రాత్రికే రాత్రే కోట్లకు పడగలెత్తిన వాళ్లెంతో మంది తమ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్లతో డీల్ చేయడం చాలా కష్టమవుతోంది. ఎందుకంటే ఈ పని చేస్తేనే వాళ్లకి పూట గడుస్తుందనే సమస్య లేదు కదా అని చెబుతున్నాడు రవిరాజ్ ఫాయిల్స్ కంపెనీ సీఎండీ జేదీప్ సింహ్ వాఘెలా. అయితే, కోకాపేటకన్నా కాస్తంత ఎక్కువ సీన్‌నే తలపిస్తున్న ఈ సనంద్ పారిశ్రామిక వాడలో టాటా కంపెనీ నానో కార్ల ఫ్యాక్టరీని పెట్టడానికి ముందు ఇక్కడి పరిస్థితి ఇలా వుండేది కాదు. ఎప్పుడైతే నానో కార్ల పరిశ్రమ సింగూరు నుంచి సనంద్‌కి తరలి వచ్చిందో.. ఆ తర్వాత వెనువెంటనే దాదాపు 200 కంపెనీలు వచ్చి ఇక్కడ వాలిపోయాయి. దీంతో ఇక్కడి భూముల ధలకి అమాంతం రెక్కలొచ్చాయి. ఫలితంగా స్థానికంగా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులే ఓవర్ నైట్‌లో కోట్లకు అధిపతులయ్యారు. ఇప్పుడా కోటీశ్వరులతోనే పనులు చేయించుకుంటున్నా... అది కాస్త తమకి కష్టంగా మారిందంటున్నారు అక్కడి పారిశ్రామికవేత్తలు. అదీ సనంద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని పారిశ్రామికవేత్తల వెతలు.
Mobile AppDownload and get updated news