కాకినాడలో తలపెట్టిన బహిరంగ సభలో సినీనటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యంగా వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లో కీలక స్థాయిలో వున్న నేతలపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎవరు ఎలా వ్యాపారం చేసుకుని పైకి ఎదిగినా తనకి ఏ అభ్యంతరం లేదు కానీ వారు ప్రజా సమస్యలు గాలికొదిలేసి వ్యాపారాలు చేసుకుంటామంటేనే కోపమొస్తుంది అని పవన్ అభిప్రాయపడ్డారు. అవంతీ విద్యా సంస్థల అధినేత అయిన అనకాపల్లి ఎంపీ(టీడీపీ నేత), జయభేరి వాణిజ్య సంస్థల అధినేత, టీడీపీ ఎంపీ అయిన మురళీ మోహన్‌లపై పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. అవంతీ శ్రీనివాస రావు పార్లమెంట్ పదవికి రాజీనామా చేస్తే, ఆయన్ని తిరిగి అనకాపల్లి ఎంపీగా గెలిపించుకునే బాధ్యత నాది అని స్పష్టంచేసిన పవన్... మురళీ మోహన్ లాంటి నాయకులు తమ తమ వ్యాపారాల్లో చూపించిన దక్షతని ప్రజా సమస్యలపై కూడా చూపిస్తే బాగుంటుందని చురకలు అంటించారు. సొంత లాభం కొంతైనా మానుకుని ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడితే బాగుంటుంది. పార్లమెంట్ లాబీల్లో కూర్చోని కూడా మన కాంట్రాక్ట్ ఏమైంది ? మన వ్యాపారాలు ఎంతవరకొచ్చాయి అని లెక్కలేసుకోవడం మానేస్తే ప్రజలకి మేలు జరుగుతుంది అని హితవు పలికారు పవన్. అలా కాదు కుదరదు అంటే నేను ఊరుకోను అంటూ నేరుగా పేర్లు చెబుతూనే వారికి తనదైన స్టైల్లో హెచ్చరికలు జారీచేశారు పవన్ కళ్యాణ్.
ఇదిలావుంటే, తనని కుంభకర్ణుడు అని సంబోధించిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు, వ్యాపారవేత్త అయిన టీజీ వెంకటేష్‌ని సైతం పవన్ విమర్శించకుండా వదిలిపెట్టలేదు. మీలా నేను నోటికొచ్చినట్టు, సంస్కారం లేకుండా మాట్లాడలేను. ఎందుకంటే నాకు సంస్కారం వుంది. నేను నోరు విప్పితే మీకు సంబంధించిన ఎన్నో నిజాలు వెలుగులోకొస్తాయి. కర్నూలు జిల్లాలో మీ పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం అంతా ఇంతాకాదు. మీ పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగా తాగునీరు కలుషితం అవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్‌లో సైతం మీ పరిశ్రమలు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. అటువంటి మీరా నన్ను విమర్శించేది అంటూ టీజీ వెంకటేష్‌పై విమర్శలు గుప్పించారు పవన్.
Mobile AppDownload and get updated news