సాధారణంగా తొమ్మిదేళ్ల వయసున్న చిన్నారులేమి చేస్తుంటారు? పలకా, బలపాల స్థాయిని దాటేసి రెండో తరగతో, మూడో తరగతిలోనో అడుగుపెట్టి పుస్తకాలు చేతపట్టుకుని చదువుకునే స్థాయికి వచ్చి ఉంటారు. అలాంటిది భోపాల్లోని ఒక మురికివాడ చిన్నారి మాత్రం తన చిట్టిప్రాయంలోనే ఏకంగా ఒక గ్రంథాలయాన్నే నడిపేస్తోంది. బోపాల్లోని అరేరా హిల్స్ ప్రాంతంలోని మురికివాడలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన ముస్కాన్ అనే చిన్నారి ఈ గ్రంథాలయాన్ని నడుపుతోంది. ఈ గ్రంథాలయంలో ప్రస్తుతం చిన్నారులు చదువుకునేందుకు 120 వరకు పుస్తకాలున్నాయి.నిరక్షరాస్యత అధికంగా ఉన్న ప్రాంతాల్లో విద్యావంతులను తయారుచేసే సంకల్పంతో రాజ్య శిక్షా కేంద్ర సంస్థ ఆలోచనలనుండి ఈ బాలపుస్తకాలయం అనే ఐడియా రూపు దాల్చింది.
ఒక చిన్నారితో, ఆమె వయసు చిన్నారుల కోసం ఒక గ్రంథాలయాన్ని నడిపితే ఎలా ఉంటుందని ఆలోచించి గత ఏడాది డిసెంబరులో దీన్ని ప్రారంభించారు. ముస్కాన్ తెలివితేటలు, ఇట్టే అల్లుకుపోయే నేర్పరితనం చూసి ఆమెకు ఈ బాధ్యతలు అప్పచెప్పగా, ఆ బాలిక కూడా నిర్వాహకుల అంచనాలకు మించి పనిచేస్తూ మెప్పుపొందింది. ఆమె ఇంటికి వెలుపల నెలకొల్పిన ఈ గ్రంథాలయంలో ప్రతీ రోజు పెద్ద సంఖ్యలో చిన్నారులు చేరి అక్కడి పుస్తకాలను ఉచితంగా చదువుకుంటారు. హోమ్ వర్క్ చేసుకుంటారు. వారికోసం ముస్కాన్ కథలు కూడా చెపుతుంది. ముస్కాన్ నేర్పరితనం, తెలివితేటలకు ముచ్చటపడిన నీతి ఆయోగ్ ఇటీవలే ఒక అవార్డును కూడా ప్రదానం చేసి ప్రశంసల వర్షం కురిపించడం విశేషం.
![]()
Mobile AppDownload and get updated news