ఇటలీ-ఫ్రాన్స్ సరిహద్దుల్లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో భూమికి 12,500 అడుగుల ఎత్తున, గడ్డకట్టించే చలిలో డజన్ల కొద్ది పర్యాటకులు రాత్రంతా నరకం అనుభవించారు. యూరప్ ఖండంలో అత్యంత ఎత్తయిన ఆల్ప్స్ పర్వత శ్రేణిని ప్రతీరోజు వందలాది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఆ పర్వత శ్రేణిలో భూమికి వందల అడుగుల ఎత్తున ఏర్పాటుచేసిన కేబుల్ కార్లు ప్రత్యేక ఆకర్షణ. వాటిలో ఎక్కి ఆల్ప్స్ పర్వతాలపై విహరించేందుకు పర్యాటకులు పోటీపడుతుంటారు. కానీ, అలాంటి కేబుల్ కార్లే ఒక రాత్రంతా సందర్శకులకు చుక్కలు చూపించాయి. ఆకస్మికంగా కొండచరియలు విరిగిపడటంతో కేబుల్ కార్ల విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దాంతో ఎక్కడి కేబుల్ కార్లు అక్కడ వందల అడుగుల ఎత్తున పర్వతాల మధ్య నిలిచిపోయి, వాటిలోని వారంతా బిక్కచచ్చిపోయారు. ఎక్కడ తామున్న కేబుల్ కారు తెగి లోయలోకి పడిపోతామోననే భయం, మరోవైపు గడ్డకట్టిస్తున్న చలిలో రాత్రంతా వారు పడ్డ నరకం వర్ణణాతీతం. అధికారులు రంగంలోకి దిగి ఎంతో కష్టపడి పర్యాటకులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఫ్రెంచ్, ఇటాలియన్ హెలీకాప్టర్ల సహాయక బృందం వారిని రక్షించింది.