Mobile AppDownload and get updated news
ముంబై నగరంలో 2013-15 మధ్యకాలంలో ఆత్మహత్యకు పాల్పడిన వారిలో 91 శాతం మంది నిరాక్షరాస్యులు లేదా మధ్యలోనే బడి మానేసిన వారేనని సమాచార హక్కు ద్వారా వెల్లడైంది. 3640 మంది సూసైడ్ చేసుకోగా, వీరిలో 3321 మంది అసలు బడికి వెళ్లని వారు లేదా మధ్యలో చదువు మానేసినవారున్నారు. 2013-15 మధ్య కాలంలో బలవన్మరణాలకు పాల్పడిన వారిలో 332 మంది అసలు బడి ముఖమే చూడలేదు. సూసైడ్ చేసుకున్న వారిలో 607 మంది ప్రాథమిక పాఠశాల చదువు పూర్తిచేయక ముందే బడి మానేశారు. పదో తరగతి వరకు చదువుకున్నవారు 838 మంది ఆత్మహత్యకు పాల్పడగా, కాలేజీ చదువును మధ్యలోనే వదిలేసినవారిలో 528 మంది ఉన్నారు. బలవన్మరణాలకు పాల్పడిన వారిలో 63 శాతం మంది పురుషులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మగవారే ఎక్కువ ప్రాణాలు తీసుకోవడానికి నిరుద్యోగం, మద్యానికి, డ్రగ్స్‌కు బానిస కావడం, పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడం ప్రధాన కారణంగా తేలింది. ఆత్మీయులు తిట్టడం వల్ల మహిళలు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతోపాటు ప్రేమ సమస్యలు, పరీక్షల్లో ఫెయిల్ కావడం మొదలైనవి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం ఆత్మహత్యల్లో 60 శాతం సూసైడ్ కేసులు 15 నుంచి 45 ఏళ్ల మధ్య వారివే కావడం గమనార్హం.