Mobile AppDownload and get updated news
సౌత్ ఇండియన్ బ్యూటీ త్రిష ఇప్పటికీ తన స్టార్‌డమ్‌ను కొనసాగిస్తోంది. ఇటీవలే 'నాయకి' అనే హారర్ సినిమా చేసి ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసిన ఈ అందాల దెయ్యం, ఆ డోస్ సరిపోలేదు అనుకుందో ఏమో కానీ మరో రెండు హారర్ సినిమాలలో నటించేందుకు రెడీ అవుతోంది. 'నాయకి' తర్వాత త్రిషకు వరుసగా హారర్ సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న 'మోహిని' అనే చిత్రంతో పాటు మరో హారర్ సినిమాలో త్రిషనే దెయ్యం. అలాగే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. త్రిష చేస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఐదు మంది త్రిషలు కనిపిస్తారంట. అదేనండీ.. డ్యూఎల్ రోల్ , ట్రిపుల్ రోల్ లాగా త్రిష ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనుంది. అందులోని రెండు పాత్రల్లో చాలా నాజూగ్గా కనిపించాలట. అందుకోసం అమ్మడు ప్రస్తుతం తన బరువును తగ్గించే పనిలో ఉంది. ఈ సినిమాలో నటించడానికి త్రిష సుమారుగా కోటి రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలవరసన్ దర్శకత్వం వహించే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.