Mobile AppDownload and get updated news
విడాకులు తీసుకుని విడిపోయినంత మాత్రాన తాను పవన్ కల్యాణ్ గురించి మాట్లాడకూడదా? అని పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూదేశాయ్ ప్రశ్నించారు. అంతేకాదు, ప్రజలంతా పవన్ గురించి మాట్లాడొచ్చు కానీ, తాను మాత్రం మాట్లాడకూడదంటే ఎలా అని ఆమె ఆవేదనచెందారు. ట్విట్టర్ ద్వారా రేణూ అడపాదడపా పవన్ కల్యాణ్ గురించి ట్వీట్లు పెడుతుంటారనే సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో పవన్ తో సంబంధమున్న ఫోటోలు, సెల్ఫీలను ఆమె షేర్ చేస్తుంటారు. దీన్ని కొందరు అభిమానులు జీర్ణించుకోలేక, ట్విట్టర్లో తనను ప్రశ్నిస్తున్న తీరు ఆవేదన కలిగిస్తోందని రేణు ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వివాహమైన తరువాత తాను పదకొండేళ్లు పవన్ తో కాపురం చేసి పిల్లలకు జన్మనిచ్చానని కొన్ని కారణాల వల్ల ఇద్దరమూ పరస్పర అంగీకారంతో విడిపోయామనే విషయాన్ని గుర్తుచేశారు. విడాకులు తీసుకున్నప్పటికీ తాము పిల్లలకోసం అప్పుడప్పుడు కలుస్తుంటామన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను పవన్ అనుమతితోనే ట్విట్టర్లో షేర్ చేస్తుంటానని స్పష్టం చేశారు. తామిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమేనని తెలిపారు.