అప్పు చేసి పప్పుకూడు అని మనకో సామెత ఉంది. ఉత్తర ప్రదేశ్ లోని ఒక దళితుడు తన ఇంటికి రాహుల్ గాంధీ వస్తున్నాడని తెలుసుకుని అప్పు చేసి మరీ లంచ్ ఏర్పాటుచేశాడు. ఇప్పుడు అదే ఆ రాష్ట్రంలో వివాదమైంది. కిసాన్ యాత్రలో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో ర్యాలీలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ ఇటీవల అక్కడి ఒక గ్రామంలోని దళితుడి ఇంట్లో బస చేశారు. ఈ సందర్భంగా ఆయన దళిత కుటుంబం ఆతిథ్యం స్వీకరించారు. రాహుల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ తదితరులు కూడా దళితుడి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేసారు. నేతలు బోంచేసి వెళ్లిపోయారు కానీ.. పాపం వారికి ఆ భోజనాన్ని ఏర్పాటుచేయడానికి ఆ దళితుడు ఎంతగానో కష్టపడాల్సి వచ్చిందిట. పూట గడవడమే కష్టమైన పరిస్థితిలో ఆ దళితుడు అప్పు చేసి మరీ వారికి భోజనాన్ని ఏర్పాటుచేసాడని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై విమర్శలకు దిగారు. తన ప్రచార పటాటోపం కోసం రాహుల్ నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కిసాన్ యాత్ర పేరిట ర్యాలీ నిర్వహిస్తున్న రాహుల్, తనకు భోజనం పెట్టిన నిరుపేదకు ఆ భోజనం ఎలా వచ్చిందనే విషయాన్ని కనీసం అడగను కూడా అడగకపోవడం విచారకరమన్నారు. కాగా, దీనిపై సదరు దళితుడు మాట్లాడుతూ తన ఇంటికి వచ్చిన రాహుల్ ను చూడగానే సాక్షాత్తు దేవుడే తన ఇంటికి వచ్చినట్లు అనిపించిందని, అందుకే ఆయనకు భోజనం పెట్టేందుకు అప్పుచేయడానికి కూడా వెనకాడలేదన్నాడు.
![]()
Mobile AppDownload and get updated news