రైల్ నీర్ కుంభకోణంలో రైల్వే శాఖకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లింది. భారతీయ రైల్వే శాఖ తన రైళ్లలో రైల్ నీర్ పేరిట సొంతంగా విక్రయించే నీటి బాటిళ్లకు బదులుగా బయటి వ్యక్తులు తయారు చేసిన నాసిరకం నీటిని రైల్ నీర్ పేరిట విక్రయిస్తున్న వైనం ఇటీవల బయటపడింది. ఈ కుంభకోణంలో రైల్వే శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, బయటి వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తేలడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జ్ షీటును దాఖలు చేసింది. రైల్వేలకు చెందిన ఇద్దరు మాజీ చీఫ్ కమర్షియల్ మేనేజర్లతో పాటు ఒక ప్రైవేట్ సంస్థ సీఈవో మరో వ్యాపారి పేరును ఆ చార్జ్ షీటులో చేర్చారు. వారిపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్లు సీబీఐ ప్రతినిధి దేవ్ ప్రీత్ సింగ్ చెప్పారు. వారిని త్వరలో పటియాలా కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఉత్తర రైల్వేల్లో మాత్రమే ప్రస్తుతం రైల్ నీర్ కుంభకోణం గురించి విచారణ ప్రారంభించారు. ఆ ఒక్క దానిలోనే రూ.20 కోట్ల నష్టం వాటిల్లింది. త్వరలో దేశంలోని మిగిలిన 16 జోన్లలో కూడా ఈ విచారణను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ నష్టాలు రూ. వందల కోట్లలోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
Mobile AppDownload and get updated news