ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు ఇవ్వడం సాధారణం. ఎమ్మెల్సీలాంటి ఎన్నికలకు బంగారు ఆభరణాలు, పట్టు చీరలిచ్చేవారు. ఇప్పుడది కూడా పాతబడిపోయింది. కర్ణాటక శాసన మండలి స్థానిక సంస్థల నియోజక వర్గాల ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులు, ఓటర్లను ఆకర్షించడానికి ఖరీదైన ఐఫోన్లు, స్విస్ వాచీలను బహుమతులుగా ఇచ్చే ట్రెండ్ మొదలైంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగనున్నాయి. ఈ పోలింగులో ఓట్లు వేసే స్థానిక ప్రజాప్రతినిధులకు ఎరవేసేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున వాటిని కొనుగోలు చేశారని అంటున్నారు. వారిని ఆకట్టుకోవడానికి కొందరు ల్యాప్ టాప్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్లను ఆశచూపుతున్నారు. తమకు గనుక తొలి ప్రాధాన్య ఓటును వేస్తే వారు కోరుకున్న దాన్ని ఇస్తామంటూ బేరాలాడుతున్నారు. ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ్, బాగల్కోట్, విజయపుర జిల్లాల్లో ఈ తరహా బేరసారాలు బాగా జరుగుతున్నాయి. కోలార్ ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ఒక అభ్యర్థి అయితే ఓటర్లకు రాడో వాచీలను ఇవ్వచూపుతున్నారు. ఆ వాచీలతో పాటు రూ.30వేల నగదును కూడా ముట్టచెప్పడం విశేషం. రాడో కంపెనీ వాచీ ధర ఎంత తక్కువలో తక్కువగా చెప్పుకున్నా కనీసం రూ.20వేలు ఉంటుంది. బెంగలూరు నగరంలో అయితే ఓటర్లకు ఐఫోన్ 5 లు ఇస్తున్నారు. కొడగు ప్రాంతంలోని ఒక అభ్యర్థి అయితే 12 ఏళ్ల క్రితం నాటి జానీ వాకర్ బ్లాక్ లేబుల్ స్కాచ్ మద్యాన్ని కూడా ఆశచూపుతున్నారు.
Mobile AppDownload and get updated news