అక్కినేని అఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ తెరకెక్కించిన అఖిల్ సినిమా అనుకున్నంత హిట్ కాకపోగా అందరి అంచనాలని తారుమారు చేస్తూ అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కినేని కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకి వస్తున్నాడని ఆశగా ఎదురుచూసిన అక్కినేని అభిమానులకి తీవ్ర నిరాశే మిగిలింది. అన్నింటికిమించి ఈ సినిమాపై ఆశలు పెంచుకున్న అఖిల్ ఫ్యామిలీ, దర్శకుడు, నిర్మాతలకి అఖిల్ ఫలితం ఓ పీడకలగా మారింది. తాజాగా అఖిల్ సినిమా ఫలితంపై స్పందించిన వినాయక్.. అఖిల్ విషయంలో తప్పుచేశానని అంగీకరించాడు. కథ కొత్తగా వుందని.. అఖిల్‌కి బాగా సూటవుతుందని భావించాను. అఖిల్ కూడా బాగానే పర్‌ఫామ్ చేశాడు. అయినా ఫలితం మాత్రం రివర్స్ అయింది. ఈ సినీపరిశ్రమలో ఒక్క రాజమౌళి తప్ప అందరూ ఏదో ఓ తప్పు చేస్తుంటారని అనుకునే నాకు.. నేను కూడా మొదటిసారిగా ఓ తప్పు చేశానని అనిపించిందని అభిప్రాయపడ్డాడు వినాయక్. శనివారం సాయంత్రం ఏలూరులోని ఓ హోటల్లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వినాయక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంకోసారి ఇటువంటి తప్పు జరగకుండా చూసుకుని, మరో మంచి సినిమాతో మీ ముందుకు వస్తానని అభిమానులకి మాటిచ్చిన వినాయక్.. అఖిల్ విషయంలో జరిగిన పొరపాటుకు క్షమించమని కోరారు.
Mobile AppDownload and get updated news