Mobile AppDownload and get updated news
తరనం అనే 20 ఏళ్ల కళాశాల విద్యార్థిని శనివారం నాడు ముంబయిలోని బాంద్రా బ్యాండ్ స్టాండ్ వద్ద సెల్ఫీ తీసుకుంటున్న తరుణంలో పెద్ద అల వచ్చి ఆమెను సముద్రంలోకి ఈడ్చుకుపోయింది. ఆమె సముద్రంలోకి కొట్టుకుపోయిన తరుణంలో ఆమె స్నేహితురాళ్లు అదే ప్రాంతంలో సముద్రపుటలలకు కాస్త దూరంగా ఉన్నారు. ఆ విద్యార్థిని సముద్రంలోకి కొట్టుకుపోతున్న దృశ్యం గమనించిన స్థానిక యువకుడు ఒకరు వెంటనే లోనికి దూకి కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడికి చేరుకుని వెతుకులాట ప్రారంభించారు. బ్యాండ్ స్టాండ్ వద్ద బాంద్రా వర్లీ సీ లింక్ వద్ద తాము సెల్ఫీలు తీసుకునేందుకు వచ్చామని బాధితురాలి స్నేహితులు పోలీసులకు తెలిపారు. తాము మాటల్లో పడి వేరే పనిపై బాధితురాలిని వదిలి సముద్రపు అలలకు కొంచెం దూరంగా వెళ్లామని, ఆమె మాత్రం అక్కడే ఉండి సెల్ఫీలు తీసుకుంటోందని, ఆ సమయంలో 50 మీటర్ల ఎత్తున అల లేచి ఆమెను తనతోపాటు సముద్రంలోకి ఈడ్చుకుపోయిందని కన్నీళ్లతో చెప్పారు.