లండన్లో రమేష్ చంద్ర ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) పెద్ద పేరున్న ఇండస్ట్రియలిస్టు. నమ్మకానికి, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. కృష్ణమూర్తి (జగపతి బాబు) కూడా అదే వ్యాపారంలో ఉంటాడు. రమేష్ చంద్ర ప్రసాద్‌ని దారుణంగా మోసం చేసి వ్యాపారంలో దివాళా తీసేలా చేస్తాడు కృష్ణ మూర్తి. ముగ్గురి పిల్లలతో రోడ్డున పడి, ఎవరికీ దొరకకుండా పారిపోతాడు ప్రసాద్. చిన్నా చితకా పనులు చేసి ముగ్గురి కొడుకుని ఉన్నత చదువులు చదివిస్తాడు. వారిలో చిన్న కొడుకే అభిరామ్ (జూ.ఎన్టీఆర్). ముగ్గురు కొడుకులు మంచి స్థాయిలో సెటిల్ అవుతారు. అభిరామ్ తండ్రిలాగే కన్ స్ట్రక్షన్ కంపెనీని స్థాపిస్తాడు. హఠాత్తుగా రమేష్ చంద్ర ప్రసాద్ కి క్యాన్సర్ అని తెలుస్తుంది. మరో మూడునెలల కన్నా ఎక్కువ కాలం బతకడని వైద్యులు చెబుతారు. అప్పుడు తన ముగ్గురి కొడుకులకి చివరి కోరిక చెబుతాడు రమేష్ చంద్ర ప్రసాద్. తనను మోసం చేసిన కృష్ణమూర్తిపై పగ తీర్చుకోవాలని చెబుతాడు. అభిరామ్ తండ్రి కోరిక తీర్చేందుకు సిద్ధమవుతాడు. కృష్ణ మూర్తి కూతురు (రకుల్ ప్రీత్ సింగ్) తనని ప్రేమించేలా చేసుకుంటాడు. ఆమె ద్వారా ఓ రోజు కృష్ణ మూర్తిని కలుసుకుంటాడు. కృష్ణ మూర్తికి అప్పటికే అభిరామ్ ఎవరో తెలిసిపోతుంది. తనను దివాళా తీయించడం ఎవరి వల్ల కాదని సవాల్ చేస్తాడు. అభిరామ్ తన తండ్రి చనిపోయేలోపు కృష్ణమూర్తి వ్యాపారాన్ని దివాళా తీయించి, అతన్ని రోడ్డున పడేలా చేస్తానని శపథం చేసి వస్తాడు. ఆ శపథాన్ని, తన తండ్రి కోరికను హీరో ఎలా నెరవేర్చాడు? ఆ క్రమంలో అతనికి ఎవరు సహకరించారు? అనేదే కథ.
జూ.ఎన్టీఆర్ ఈ సినిమాలో కొత్త లుక్ తో బాగానే ఆకట్టుకున్నాడు. తండ్రి కోరికను తీర్చే తనయుడిగా నటనలో మంచి పరిణతిని కనబర్చాడు. హావభావాల్లోనూ, నడతలోనూ హుందాతనం ఉట్టిపడేలా నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ తన అందంతో యువతను బాగానే ఆకట్టుకుంది. సినిమా లండన్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది... మంచి లోకేషన్లలో పాటల్ని, సన్నివేశాల్ని చిత్రీకరించారు. తండ్రి పగని కొడుకు తీర్చుకోవడమనే కథ మాత్రం తెలుగు ప్రేక్షకులకి తెలిసిందే. ఈ సినిమా కూడా గతంలో సుకుమార్ తీసిన వన్ సినిమాలోలాగా లండన్లోనే సాగటం వెనుక సుకుమార్ సెంటిమెంట్ ఏమిటో మరి? లాజికల్ గా చూసుకుంటే.. రాజేంద్ర ప్రసాద్ ఒక ఇంటెలిజెంట్ తనని జగపతి బాబు ఎలా మోసం చేసాడు అన్నది చూపించలేదు. .సినిమాలో ఎక్కడా ఆహా అనేలా థ్రిల్స్ ఉండవు. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు, సితార... వీరంతా బాగా నటించారు. విజయ్ సి చక్రవర్తి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయింది. సుకుమార్ పై గొప్పఅంచనాతో వెళితే మాత్రం నిరాశే కాని జూనియర్ ఎన్టీఆర్ నటనపై నమ్మకంతో నిమా థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడిని మాత్రం నిరాశచెందనివ్వదు.
రేటింగ్: 3\5
Mobile AppDownload and get updated news