దేశ వ్యాప్తంగా ముంబయి మారథాన్ కు మంచి పేరుంది. ఈసారి మాత్రం చెడ్డపేరును తెచ్చుకుంది. ఆ సుదీర్ఘ పరుగులో పాల్గొని పరుగులు తీయడానికి దేశ విదేశాలనుండి మారథానర్లు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ ఏడాది కూడా మొన్న ఆదివారం నాడు ముంబయి మారథాన్ నిర్వహించారు. ఎప్పటి మాదిరే దాదాపు 40వేల మంది మారథానర్లు పరుగులో పాల్గొన్నారు. ఆ తరువాత వారు ఆజాద్ మైదాన్లో అలుపు తీర్చుకుని ఎవరిళ్లకు వాళ్లు చక్కాపోయారు. ఆ తెల్లారి సోమవారం ఆజాద్ మైదానంలో స్కూలు విద్యార్థుల క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. ఆ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. ఒక్కొక్కటీ తక్కువలో తక్కువ రూ.100 అయినా ఖరీదు చేసే దాదాపు 42 వేల శాండ్ విచ్ ప్యాకెట్లు ఆ గ్రౌండులో నేలమీద చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. అవన్నీ పాచిపట్టి దుమ్ముకొట్టుకుపోయి దుర్వాసన వస్తున్నాయి.
సాధారణంగా మారథాన్ వంటి సుదీర్ఘపరుగుల్లో పాల్గొనేవారు ఉన్నత కుటుంబాల నుండే ఎక్కువగా వస్తుంటారు. వారిని దృష్టిలో పెట్టుకున్న ముంబయి మారథాన్ నిర్వాహకులు ఖరీదైన రెస్టారెంటు నుండి ఆ శాండ్ విచ్ లను ఆర్డర్ చేసి చాలా మొత్తం ఖర్చుపెట్టి తెప్పించారు. ఆజాద్ మైదానానికి సమీపంలో నిరుపేదలు నివసించే కాలనీ ఒకటి ఉంది. కాలే కడుపులతో ఉండే కాలనీ వాసులు ఎక్కడ ఆజాద్ మైదానానికి వచ్చి ఆ శాండ్ విచ్ లను దొంగతనం చేసి తినేస్తారోననే భయంతో వాటిని టేబుళ్ల కింద దాచిపెట్టారని.. పోటీ ముగియగానే వాటిని మరిచిపోయి ఎవరి దారిన వారు వెళ్లిపోయారని.. పేరు చెప్పవద్దని కోరుతూ ముంబయి మారథాన్ సిబ్బంది ఒకరు చెప్పారు. మారథాన్లో పాల్గొనేవారికోసం ఆర్డర్ చేసిన ఒక్కో శాండ్ విచ్ ప్యాకెట్లో శాండ్ విచ్ తో పాటు ఒక బనానా కేకు ముక్క, ఒక యాపిల్, ఒక చాక్లెట్, ఒక స్లిమ్ మిల్క్, ఐస్డ్ టీ పౌడర్, నీళ్లతో నిండిన సీల్డ్ గ్లాస్ ఉంటుంది. వీటిని రిఫ్రెష్మెంట్ ప్యాక్ గా కూడా పిలుస్తారు. దేశంలోని 20 ప్రఖ్యాత కార్పోరేట్ సంస్థలు ఈ ఈవెంటును స్పాన్సర్ చేశాయి. అటు మారథానర్లకు ఇవ్వక.. ఇటు పేదల కడుపూ నింపక తిండిని ఆ కార్పోరేట్ సంస్థలు వృధా చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Mobile AppDownload and get updated news