ఇంట్లో మరుగుదొడ్డి లేని కారణంగా బహిర్భూమికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కున్న రేఖ అనే ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఇంకా ఈ అవమానాల బతుకు బతకలేనంటూ అర్థాంతరంగా తనువు చాలించిన విషాద ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లా గుండాల మండల కేంద్రంలో వెలుగుచూసింది. నిత్యం బహిర్భూమి కోసం బయటికి వెళ్లాలంటే చచ్చేంత అవమానంగా వుందని.. అందుకే ఇంట్లోనే మరుగుదొడ్డి నిర్మించుకుందామని గత ఆరు నెలలుగా అమ్మానాన్నలతో పోరు పెట్టుకుందా యువతి. కూతురు ఎన్నిసార్లు మరుగుదొడ్డి గురించి ప్రస్తావించినా... ఇప్పుడు అంత డబ్బు కానీ, అందుకు అవసరమైన స్థలం కానీ మనకి లేదు. తర్వాత చూద్దాంలే అనే సమాధానమే వచ్చిందా తల్లిదండ్రుల నుంచి. సోమవారం ఉదయం కూడా ఇదే విషయమై తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగింది. ఆర్థిక ఇబ్బందులు తీరాకా మరుగుదొడ్డి నిర్మించుకుందాం అని ఎప్పటిలాగే ఆమెకి నచ్చచెప్పి తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్లిపోయారు. ఇంట్లో మరుగుదొడ్డి కోసం ఎంత చెప్పినా తల్లిదండ్రులు తన మాట పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన రేఖ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకి పాల్పడింది. తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు గుండాల ఎస్సై రాజు తెలిపారు.
Mobile AppDownload and get updated news