మహారాష్ట్రలోని శని సింఘనాపూర్లోని ప్రముఖ శని దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ సమర్థించారు. శని దేవాలయంలోకి మహిళలను నిరోధించే పురాణాల్లో రాసి లేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశంలో మహిళలు ప్రవేశించవీల్లేని ప్రముఖ హిందూ దేవాలయాల్లో శని దేవాలయం కూడా ఒకటి. దక్షిణాదిలో శబరిమల క్షేత్రంలో కూడా మహిళలకు ప్రవేశం లేదు. ఈ అంశంపై సుప్రీం కోర్టు కూడా ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భూమాత బ్రిగేడ్ పేరిట మహిళా హక్కుల కార్యకర్తల బృందం ఒకటి శని దేవాలయంలోకి ప్రవేశించేందుకు బుధవారం నాడు ప్రయత్నించగా దాన్ని దేవాలయ వర్గాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా మహిళల ప్రవేశానికి అనుకూలంగా, వ్యతిరేకంగా రెండు గ్రూపులుగా విడిపోయిన బృందాల దేవాలయం వద్ద మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున తమ బలగాలను మోహరించారు. ఈ ఘటనపై రవిశంకర్ స్పందించారు. మహిళలకు దేవాలయంలో ప్రవేశాన్ని నిరోధించాలనేదాన్ని బలపరిచే పురాణ ప్రతులేవీ లేవన్నారు. దేవాలయంలోకి పురుషులు ప్రవేశించగా లేనిది.. స్త్రీలు ప్రవేశిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా మహిళల పట్ల వివక్ష చూపదని స్పష్టం చేసారు. ![]()
శని దేవాలయంలోకి ప్రవేశించేందుకు భూమాత బ్రిగేడ్ మహిళా కార్యకర్తల యత్నం
Mobile AppDownload and get updated news