నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయన నిక్షేపంగా ఉన్నారంటూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. తీవ్రమైన అలసటతో సొమ్మసిల్లిపోయిన ఆయన గతవారం పూనేలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. ఆయన మూడు రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. ఈలోగా ఎవరో ఆయనకు ఆరోగ్యం బాగా విషమించిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఆ తరువాత ఎవరో మళ్లీ ఆయన మరణించారంటూ మరో పోస్ట్ పెట్టారు. అది చూసిన పార్టీ అభిమానులు ఆయన పరిస్థితిని వాకబు చేస్తూ పార్టీకి శరపరంపరగా ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. మంగళవారం గణతంత్ర దినోత్సవం కావడంతో శరద్ పవార్ మరణాన్ని పార్టీ రహస్యంగా ఉంచుతోందని, బుధవారం నాడు ఆ విషయాన్ని దేశానికి వెల్లడిస్తారంటూ తెగ ప్రచారం జరిగంది. దీన్ని పార్టీ నాయకత్వం ఖండించింది. ఆయనకు ఏమీ కాలేదని స్వల్ప అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందారని వివరించింది. ఇందుకు సంబంధించి ఒక వీడియోను కూడా పార్టీ విడుదల చేసింది. ఆ వీడియోలో 75 ఏళ్ల ఆ మరాఠా యోధుడు తన కుమార్తె సుప్రియా సూలేతో ముచ్చటిస్తూ కనిపించారు. తాను మరణించానంటూ వచ్చిన వార్తలకు స్పందనగా ఆయన చిరునవ్వు నవ్వారు.
Mobile AppDownload and get updated news