Mobile AppDownload and get updated news
తునిలో ఆదివారం జరిగిన కాపు గర్జన కార్యక్రమానికి నాయకత్వం వహించారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఆ గర్జన కాస్త హింసాత్మకంగా మారి విధ్వంసం జరిగింది. ఆందోళన కారులు రెచ్చిపోయి రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను, రెండు పోలీస్ స్టేషన్లను తగులబెట్టారు. పోలీసులను, మీడియా సిబ్బందిని చితక్కొట్టారు. వారిలో ఇద్దరి పోలీసుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ మొత్తం ఘటనపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. మీడియాతో మాట్లాడారు. తాను ఉద్యమానికి మాత్రమే నాయకత్వం వహించానని, హింసకు కాదని అన్నారు. పోలీసులపై, మీడియాపై జరిగిన దాడికి తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆందోళనకారులంతా సంయమనంతో ఉండాలని, శాంతియుతంగా పోరాడాలని కోరారు. తాను దాడులను ప్రోత్సహించనని అన్నారు. కాపులకు న్యాయం జరిగేవరకు విశ్రమించనని అన్నారు. ఉద్యమంతో ఏ పార్టీకి సంబంధం లేదని అన్నారు. తమను వెనకుండి ఎవరో రెచ్చగొడుతున్నారనడం అవాస్తవమన్నారు. ఎప్పటి నుంచో కాపులను బీసీల్లో కలపాలన్న డిమాండ్ ఉందని తెలిపారు. ఎలాంటి రాజకీయప్రయోజనాలు తాను కోరుకోవడం లేదన్నారు. నాలుగైదు రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని, తనకు మద్దతుగా ఎవరూ రావొద్దని అన్నారు.