Mobile AppDownload and get updated news
హైదరాబాద్ యూనివర్సిటీ స్కాలర్ వేముల రోహిత్ మరణం ఉదంతం, ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ పై దేశద్రోహం కేసు అంశాలు పార్లమెంటును కుదిపేసాయి. కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం దేశంలోని అన్ని యూనివర్సిటీలను కాషాయీకరణ చేసేస్తోందని విపక్షాలు లోక్ సభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా దుయ్యబట్టాయి. సభను జరగకుండా అడ్డుకున్నాయి. చివరకు ఈ వ్యవహారంపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ కలుగచేసుకుని మాట్లాడాల్సి వచ్చింది. తమ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను కాషాయీకరిస్తోందనే ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. అందుకు ఆధారాలు చూపితే తక్షణమే రాజీనామా చేస్తానని విపక్షాలకు ఆమె సవాలు విసిరారు. దేశంలో ఇప్పటికీ పలు విశ్వవిద్యాలయాల్లో అలనాటి యూపీఏ ప్రభుత్వం నియమించిన వ్యక్తులే వీసీలుగా కొనసాగుతున్నారని, విద్యను, విశ్వవిద్యాలయాలను కాషాయీకరిస్తున్నట్లుగా ఆ వీసీలతో చెప్పించాలని.. ఒకవేళ ఆ వీసీలు విపక్షాల వాదనలతో ఏకీభవిస్తే తాను రాజకీయాలనుండి వైదొలగుతానన్నారు. రోహిత్ గురించి మాట్లాడేటప్పుడు తాను అతనిని ఒక దళిత విద్యార్థిగా చూడటం లేదని, మన ఇంట్లోని ఒక బిడ్డగా చూస్తున్నానన్నారు. విశ్వవిద్యాలయాలను రాజకీయాలమయం చేయవద్దని హితవు పలికారు. విద్యార్థులను ఓటుబ్యాంకులుగా చూసే రాజకీయాలు మానుకోవాలని కోరారు. ఒక సమయంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తన పేరు స్మృతీ అని.. తన కులమేమిటో అడగాలని విపక్షాలకు సవాలు విసిరారు.