తారాగణం : అడవి శేష్, అదాశర్మ, అనసూయ, సత్యం రాజేష్
సంగీతం : పాకల శ్రీచరణ్
దర్శకత్వం : రవికాంత్
నిర్మాత : పివిపి సినిమా
కథ, కథనం, స్క్రీన్ ప్లే అన్నీ పకడ్బందీగా ఉంటే సినిమా ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా మనసును ఎంతగా ఆకట్టుకోగలదనటానికి క్షణం సినిమా ఓ ఉదాహరణ. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఎక్కడా టెంపో చెడనీయకుండా దర్శకుడు ఆసక్తికరంగా మలిచిన తీరు ప్రశంసనీయం. సినిమాలో పాత్రలన్నీ సహజంగా కథకు అవసరమైన తీరులోనే అవసరమైనమేరకే ఉండటంతో ఎక్కడా ప్రేక్షకుడికి వీళ్లు ఎక్ స్ట్రా చేస్తున్నారని అనిపించదు. మనమూ కథలో లీనమై కిడ్నాపైన పాప ఏమైంది? దొరుకుతుందా లేదా? అని టెన్షన్ పడతాం. ఇంటర్వెల్ కు ముందే హీరోయిన్ ను చంపేసినా అది కథలో మరింత ఆసక్తి కలిగించిందే తప్ప హీరోయిన్ లేకుండా ఎలా నడుస్తుంది అనే సందేహాన్నికలిగించదు. యాంకర్ అనసూయ కథను కీలకమైన మలుపు తిప్పటానికే తప్ప అనవసరంగా ఇరికించినట్లు కనిపించదు. హీరో అడవి శేష్, హీరోయిన్ అదాశర్మం అంతా చాలా సహజంగా నటించారు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను కూడా అందించిన శేష్, అంతా తానే అయి సినిమాను నడిపించాడు. నటుడిగానే కాదు సాంకేతిక నిపుణుడిగా కూడా అడవి శేష్ తనని తాను నిరూపించుకున్నాడు. తెలుగు తెరకు చాలా కొత్త కథను అందించటంతో పాటు అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. ఏ ఒక్క సీన్ ను ప్రేక్షకుడు ముందుగానే ఊహించే అవకాశం లేకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్ గా సినిమాను నడిపించాడు. దర్శకుడు రవికాంత్ టేకింగ్ బాగుంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా సత్యం రాజేష్ ఆకట్టుకున్నాడు.
కథ:
హీరో రిషి ఓ ఎన్నారై. అమెరికాలో మంచి కంపెనీ నడుపుతుంటాడు. అతని స్నేహితులు పెళ్లి చేసుకోమని పోరు పెట్టినా వినిపించుకోడు. కారణం గతంలో అతను ఇండియాలో మెడిసిన్ చదివేందుకు వెళ్లి అక్కడ సహ విద్యార్థిని శ్వేతతో ప్రేమలో ఫడతారు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. శ్వేత తండ్రి అందుకు అంగీకరించకుండా శ్వేత పెళ్లి వేరే వ్యక్తితో నిర్ణయిస్తాడు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిరర్ణయించుకుంటారు. అకస్మాత్తుగా శ్వేత తండ్రికి ప్రమాదకరమైన జబ్బు చేయటంతో ఆమె తండ్రికోసం వేరే పెళ్లి చేసుకుంటుంది. హీరో చదువు వదిలేసి అమెరికా వచ్చేస్తాడు. నాలుగేళ్ల తరువాత శ్వేత ఫోన్ చేసి రమ్మని కోరటంతో ఇండియా వస్తాడు. తన కూతురు కిడ్నాపైందని ఎవరూ తనకు సాయపడటం లేదని వెతికి పెట్టమని ఆమె కోరుతుంది. ఆ పనిలో ఉండగా పోలీసులు, శ్వేత భర్త, బయటివారు అంతా శ్వేతకు అసలు కూతురే లేదని ఆమెకు మతి సరిగా లేక అలా మాట్లాడుతోందని అందుకే కేసు కూడా క్లోజ్ అయిందని చెబుతారు. సాక్ష్యాలు కూడా ఆ విషయాన్నే బలపపరుస్తాయి. ఇంతకీ అసలు పాప ఉందా లేదా? చివరకు హీరో ఏం తెలుసుకున్నాడు? శ్వేత అతన్నే ఎందుకు అమెరికా నుంచి రప్పించింది? వగైరా ప్రశ్నలన్నీ వెండితెరపై చూడాల్సిందే.
రేటింగ్: 4\5
Mobile AppDownload and get updated news