Mobile AppDownload and get updated news
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కడలూరు వద్ద సోమవారం సాయంత్రం తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ దిశగా పయనిస్తోంది. వాయుగుండం తీవ్రమై ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురియనున్నాయి. ఈ ప్రభావం దక్షిణ తీరాంధ్ర జిల్లాలతోపాటు, రాయలసీమల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వాయుగుండం వల్ల తమిళనాడు రాజధాని చెన్నై ఇప్పటికే జలమయమై జనజీవనం స్థంభించింది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈ కారణంగా అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. సోమవారం రాత్రి ఈ వార్త ప్రచురితమయ్యే నాటికి తీరాంధ్రలోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. వర్షం తాకిడికి పలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో సముద్రపు అలలు అయిదు మీటర్ల ఎత్తుకు ఎగిరిపడుతున్నాయి. తుపాను వల్ల ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఆరుగురు చనిపోయారు.