Mobile AppDownload and get updated news
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ అతివాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.), ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ (ఐసిస్) ఒకటేనని వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో జరిగిన మైనారిటీల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ కు, ఐసిస్ కు ఏమాత్రం తేడా లేదని రెండింటి లక్షణాలు, వ్యవహార శైలి ఒకటేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఐసిస్ తీవ్రవాద సంస్థను ఎలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామో.. అదే రీతిలో ఆర్ఎస్ఎస్ ను కూడా వ్యతిరేకిస్తున్నామని ఆజాద్ చెప్పారు. కాగా ఆయన వ్యాఖ్యలకు బీజేపీతో పాటు పలు హిందూ సంస్థలు తీవ్రంగా స్పందించాయి. గులాం నబీ ఆజాద్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ఒకరు దీనిపై మాట్లాడుతూ ఈ తరహా వ్యాఖ్యలు గులాం నబీ ఆజాద్ మేథో దివాళాకోరుతనాన్ని రుజువు చేస్తున్నాయన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని తమ సంస్థ పరిశీలిస్తోందన్నారు. బీజేపీ ప్రతినిధి మాట్లాడుతూ ఆజాద్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఆయనపై సోనియా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.