రెండు రోజుల క్రితం తమిళనాడులోని ఉడుముల్ పేటలో అగ్రకులానికి చెందిన కౌసల్యను పెళ్లి చేసుకున్నాడని దళితుడైన శంకర్ ను రోడ్డుమీద కత్తులతో నరికి చంపారు. అడ్డొచ్చిన కౌసల్యను తీవ్రంగా గాయపరిచారు. ఆ హత్య చేసిన వారిని పోలీసులు పట్టుకున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం... కౌసల్య బంధువే హత్యకు ప్లాన్ వేశాడు. కౌసల్య తండ్రి పరువు పోయిందంటూ ఏడుస్తుంటే... అతని బాధ తీర్చడం కోసమే చంపానంటూ పోలీసులకి చెప్పాడు. ఇలా ఒక్క శంకరే కాదు... అనేక మంది కులాంతర వివాహానికి బలైపోయారు. ముఖ్యంగా అబ్బాయి దళితుడై... అమ్మాయి అగ్రవర్ణానికి చెందితే... ఆ అమ్మాయి రక్తసంబంధీకులే అబ్బాయిని చంపించడమో లేక తమ కూతురినే చంపేయ్యడమో ఎక్కువగా చేస్తున్నట్టు ఎన్జీవోల పరిశీలనలో తేలింది. అదే అమ్మాయి దళితురాలై... అబ్బాయి అగ్రకులానికి చెందిన వాడైతే పెళ్లయిన కొన్ని రోజులకే వారిద్దరినీ విడదీసి... అమ్మాయికి 'జీవితంలో ఇంకెప్పుడు మా అబ్బాయిని కలవకు... 'అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అలా 84 శాతం మందిని పెద్దలు విడదీశారు. ఆ అమ్మాయిలంతా ఇప్పుడు ఒంటరిగా బతుకుతున్నారు. ఓ ఎన్జీవో చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది.
2014లో ఆరునెలల గర్భిణీ అయిన వైదేహిని దళితుడిని పెళ్లి చేసుకుందన్న కారణంగా... ఆమె తల్లే కిరాయి హంతకులతో చంపించింది. కన్నపేగు కన్నా... పరువే ముఖ్యమనుకునే ఇలాంటి తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్లు, బంధువులు... ఇప్పటికీ తమిళనాడులో చాలా ప్రాంతాల్లో ఉన్నారు. ప్రేమని పంచడం వారి దృష్టిలో తప్పు... అదే క్రూరమృగాల్లా మనిషిని వేటాడి చంపడం మాత్రం వారి దృష్టిలో పరువుతో కూడిన పని.
Mobile AppDownload and get updated news