నాగచైతన్య కథానాయకుడిగా సుకుమార్ దర్వకత్వంలో రూపొందిన చిత్రం 100% లవ్. తమన్నా హీరోయిన్ నటించిన ఈ చిత్రం కమర్షియల్‌గా చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. నాగచైతన్య కెరీర్‌లో టాప్ త్రీ చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. అయితే తొలుత ఈ చిత్రంలో హీరోగా నాగచైతన్య స్థానంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ను తీసుకోవాలని భావించిన సుకుమార్, అల్లు అరవింద్ అతడిని కలిసి కథను వినిపించారట. ఈ కథకు తాను యాప్ట్ కాదనే ఉద్ధేశ్యంతో చిత్ర అవకాశాన్ని తిరస్కరించినట్లు దేవిశ్రీప్రసాద్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటికీ హీరోగా నటించాల్సిందిగా తెలుగు, తమిళ భాషల్లో పెద్ద బ్యానర్స్ నుంచి తనకు అవకాశాలు వస్తున్నాయని, దిల్‌రాజు, అల్లు అరవింద్, జ్ఞానవేళ్ రాజాతో పాటు పలువురు ప్రొడ్యూసర్స్ సినిమా కోసం డేట్స్ కేటాయించాల్సిందిగా కోరుతున్నారని దేవిశ్రీప్రసాద్ తెలిపారు. కానీ మనసుకు నచ్చిన కథలు దొరక్కపోవడంతో తాను అంగీకరించడం లేదని అన్నారు. తన బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథ దొరికితే తప్పకుండా హీరోగా నటిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగులో అగ్ర సంగీతదర్శకుడిగా చెలామణి అవుతున్న దేవిశ్రీప్రసాద్. సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవంచిత్రాలకు స్వరాలను అందిస్తున్నారు.
Mobile AppDownload and get updated news